boya raju
-
అతిగా మద్యం తాగి ఆటోడ్రైవర్ మృతి
అనంతపురం సెంట్రల్: అతిగా మద్యం తాగి ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం ఉదయం గుత్తిరోడ్డులోని ఓ మద్యం దుకాణం దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పిల్లిగుండ్లకాలనీలో నివాసముంటున్న బోయరాజు (35) ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసైన రాజు బుధవారం రాత్రి గుత్తిరోడ్డులో ఓ మద్యం దుకాణంలో ఫుల్లుగా తాగాడు. ఆహారం, మంచి నీళ్లు లేకుండానే ఎక్కువ మోతాదులో మద్యం సేవించడంతో చనిపోయాడని పోలీసులు వర్గాలు తెలిపాయి. రాజు మృతి చెందిన విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. మొదట హత్యగా భావించినా పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మద్యం సేవించడం వల్లే చనిపోయాడని నిర్ధారించారు. మద్యం షాపులు తొలగించాలని ఆందోళన ఆటో డ్రైవర్ చనిపోవడానికి జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలే కారణమని, వెంటనే వాటిని తొలగించాలని వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. గుత్తిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మద్యం షాపులు తొలగిస్తామని ఎక్సైజ్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ, సీపీఐ నాయకులు లింగమయ్య, అల్లీపీరా, శ్రీరాములు, సీపీఎం నాయకులు ముస్కిన్, మహిళా సమాఖ్య నాయకులు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
– చోరీకి గురైన ట్రాక్టర్ స్వాధీనం – దొంగల్ని పట్టించిన సీసీ కెమరాలు హిందూపురం రూరల్ : రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ట్రాక్టర్ని అందరి కళ్లుకప్పి అంతర్రాష్ట్ర దొంగలు అపహరించినట్లు హిందూపురం రూరల్ సీఐ రాజగోపాలనాయుడు, ఎస్ఐ ఆంజనేయులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్లో వారు మీడియాకు ఇలా తెలిపారు. మండలంలోని దేవరపల్లి గ్రామానికి చెందిన రామచంద్రప్ప కుటుంబ పోషణ కోసం ఫైనాన్స్‌లో రూ.6లక్షలా80 వేలు రుణం తీసుకుని ట్రాక్టర్‌తో జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం సంతేబిదనూరు గేటు వద్ద రోడ్డుపక్కనే ట్రాక్టర్ నిలిపి ఉంచి రామచంద్రప్ప భోజనానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి ట్రాక్టర్ కన్పించలేదు. చుట్టుపక్కల గ్రామాలు, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ట్రాక్టర్ ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఇటీవలే ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాల్లోని పుటేజీల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మధుగిరిలో ఆరా తీయగా దొంగలు బోయరాజు (26), బోయ గోపీ (32) అని, రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా ట్రాక్టర్‌ను చూపించినట్లు సీఐ తెలిపారు. ట్రాక్టర్ని స్వాధీనం చేసుకుని నిందితుల్ని రిమాండ్‌కి తరలించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ నారాయణ, హెడ్‌కానిస్టేబుల్ అక్బర్ కానిస్టేబుల్ రవీ, వసంత్ తదితరులు ఉన్నారు. -
మామా.. మజాకా!
– కోడలిని కిడ్నాప్ చేసిన మేనమామ – తనకు దక్కదేమోననే ఉద్దేశంతోనే కిడ్నాప్‌నకు యత్నం – బెంగళూరు వైపు తీసుకెళ్తుండగా పట్టుకున్న ధర్మవరం పోలీసులు -------------------------------------------------------- అనంతపురం సెంట్రల్/ధర్మవరం అర్బన్ : తనకు దక్కనిది ఇంకెవరికీ దక్కకూడదనుకున్నాడో ఏమో మేనకోడలిని కిడ్నాప్ చేయబోయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడో మేనమామ. కాలేజీ వద్ద వదులుతానంటూ బాలికను నమ్మించి, బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవాలనుకున్న అతని కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన నరసింహులు కుమారుడు బోయ రాజు(23) బేల్దారి పని చేసేవాడు. రుద్రంపేట పంచాయతీలో ఉంటున్న తన అక్కబావల కుమార్తె(16) అనంతపురం కోర్టు రోడ్డులోని శ్రీసత్యసాయి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజు పథకం రచించాడు. రోజూలాగే శనివారం కూడా తన అక్క ఇంటి వద్దకు వెళ్లాడు. కాలేజీ దగ్గర వదులుతానంటూ ఆమెను నమ్మించాడు. నిజమేనని నమ్మిన ఆ అమాయకురాలు అతని వెంట బైక్‌పై బయలుదేరింది. రుద్రంపేట వద్దకు రాగానే అనంతపురంలోకి కాకుండా బైక్ జాతీయ రహదారి వైపు పరుగులు పెట్టించాడు. అనుమానం వచ్చిన ఆమె నిలదీసింది. అయినా సమాధానం చెప్పకుండా బైక్‌ను వేగంగా నడిపాడు. రాప్తాడు దాటిన తర్వాత సదరు బాలిక గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ధర్మవరం పోలీసులకు సమాచారం అందించారు. ధర్మవరంలోని విలేకరుల కాలనీ సమీపానికి బైక్ చేరుకోగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు. అనంతరం బాలికతో పాటు ఆమె మేనమామను అనంతపురం నాలుగో పట్టణ పోలీసులకు అప్పగించారు.