టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
నాయుడుపేట: నాయుడుపేట డీఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశంలో పురపాలక శాఖమంత్రి నారాయణ సాక్షిగా టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల నాయకులతో ఏర్పాటు చేసిన టీడీపీ సమీక్ష సమావేశంలో మంత్రి నారాయణతో పాటు పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వీరి సమక్షంలోనే మాజీ మంత్రి పరసా వెంకటరత్నయ్యపై సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి, జలదంకి మధుసూదన్‌రెడ్డిలు ఆగ్రహంతో ఊగిపోయారు. పరసా తీరును పలుమార్లు మంత్రి నారాయణ, బీదల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తాము పార్టీని బలోపేతం చేసుకుంటూ అధికార పార్టీ పెట్టే ఆగడాలను తట్టుకుని ముందుకెళ్లామన్నారు.
పార్టీకి ఆహర్నిశలు పనిచేసి పలు విజయాలలో కీలకంగా వ్యవహరించిన తమపై పరసా పెంచి పోషిస్తున్న ఇసుక మాఫియా వర్గం, ఆయన కింద పనిచేసే మరో వర్గం నిత్యం దాడులకు తెగబడుతూ, ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు పెడతామంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మాటలు విన్న నారాయణ, రవిచంద్రలు నోరు మెదపకుండా ఉండిపోయారు. మధ్యలో వాకాటి నారాయణరెడ్డి జోక్యం చేసుకోవడంతో కొందరు నాయకులు మధుసూదన్‌రెడ్డి చేతులు పట్టుకుని, పార్టీ సమీక్ష సమావేశంలో వర్గ విభేదాలను ప్రస్తావించడం సరికాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై వేదికపైనున్న పరసా ఎలాంటి ప్రత్యారోపణలు చేయక పోవడం విశేషం.
ఇదిలా ఉండగా టీడీపీ సీనియర్ నాయకుడు, గుంటూరు లక్ష్మయ్య తనకు వేదికపై తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని, ఎన్నికల సమయంలో సమావేశాలకు మాత్రమే పిలుస్తున్నారని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, ఎంపీపీ తుపాకుల కన్నెమ్మ, నాయుడుపేట చైర్‌పర్సన్ మైలారి శోభారాణి, జెడ్పీటీసీ శ్రీరామ్‌ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్‌రెడ్డి, గూడూరు రఘునాథరెడ్డి, ఎన్‌డీసీసీబీ డైరెక్టర్ కలికి మాధవరెడ్డి, పరంధామిరెడ్డి, పరసా వెంకటరమణయ్య, ఎంపీటీసీలు పనబాక భూలక్ష్మి, బల్లి యేసుదాసు తదితరులు ఉన్నారు.