విజయవాడ స్పోర్ట్స్: కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విజయవాడలోని ఎ1- కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం అంతర్జాతీయ యోగా డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 7 నుంచి 8గంటల వరకు చిన్నారులు, యోగా గురువులతో కలిసి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపీలు, నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్‌రావు, శాప్ చైర్మన్, అధికారులు యోగాసనాలు వేసి స్ఫూర్తినిచ్చారు. మంత్రి సురేష్‌ప్రభు మాట్లాడుతూ.. యోగా ప్రాచీన భారతీయ వారసత్వ సంపదన్నారు. కేవలం సంపద ఉన్నంత మాత్రాన అగ్రస్థానానికి చేరుకోలేమని, ఆరోగ్యకరమైన జీవన విధానం ఎంతో ముఖ్యమన్నారు. పరిపాలనలో సానుకూల దృక్పథంతో పనిచేయడానికి యోగా తోడ్పడుతుందన్నారు.
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రధాన నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రపంచమంతా ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. యోగాతో శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ లయబద్ధంగా పనిచేస్తాయన్నారు. తద్వారా మనుషులంతా సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవడంతో ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుందన్నారు. ఇందుకోసమే నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. కేంద్రంలోని 57 మంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. యోగాను ఈ ఒక్క రోజే ఆచరించడం కాకుండా నిత్యం సాధన చేసి చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సురేష్ ప్రభు పిలుపునిచ్చారు.
ఆత్మను, అంతరాత్మను కలిపేది యోగా: సీఎం చంద్రబాబు
యోగా ఆత్మను, అంతరాత్మను కలుపుతుంద ని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపదైన యోగాను నేడు ప్రపంచమంతా ఆచరిస్తోందన్నారు. యోగా చక్కటి జీవన విధానాన్ని, ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఇది ఒక ప్రాంతానికి, కులానికి, మతానికి పరిమితం కారాదన్నారు. యోగా శాస్త్రీయంగా సాధనచేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం వస్తుందని తెలిపారు. ఆ ఆరోగ్యం యోగాతో వస్తుందన్నారు. ఉద్యమ స్ఫూర్తిగా ఒక్కొక్కరు కనీసం నలుగురైదురికైనా యోగా నేర్పించాలని పిలుపునిచ్చారు. యోగాతో పాటు భారతీయ వారసత్వ సంపదైన కూచిపూడి నృత్యానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. యోగా, పౌష్టికాహార మిషన్ కోసం ఆయుష్ శాఖకు రూ.25కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
20 ఏళ్ల క్రితమే అధికారులకు యోగాలో శిక్షణ
ప్రభుత్వంలోని అధికారులందరికి ఇరవై ఏళ్ల కిందటే యోగా శిక్షణ తరగతులు ఇప్పించానని, అప్పట్లో యోగా ఎందుకని అందరూ నవ్వారని, నేడు అది విశ్వవ్యాపితం అయిందన్నారు. మనిషి మనిషిగా బతకాలంటే అది యోగా ద్వారానే సాధ్యమవుతుందన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి చెబుతూ, అమెరికాలో ఎన్నిసార్లు పెళ్లిళ్లు చేసుకున్నా అక్కడ నిజమైన ఆనందం లేదంటూ దాంపత్య జీవితాలపై తనదైన శైలిలో సీఎం వివరించారు. కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడే నిజమైన ఆనందం ఉంటుందన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలు మనవారేనని గుర్తుచేశారు. ప్రకృతిని ఆరాధిస్తూ దాన్ని పెంచిపోషించాలన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే నాగరికతలో భారత్ ముందుందన్నారు. అలాగే భారతదేశంలో ఏపీ ముందుండాలని యువతకు పిలుపునిచ్చారు.
కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్‌రావు నేతృత్వంలో జరిగిన ఈ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, డెప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, కంభంపాటి రామ్మోహనరావు, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్, వైద్య-ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆయుష్ కమిషనర్ రేవతి, శాప్ చైర్మన్ పి.ఆర్.మోహన్, దక్షిణ మధ్య రైల్వే జి.ఎం. రవీంద్రగుప్తా, విజయవాడ డీఆర్‌ఎం అశోక్‌కుమార్, ఎన్‌సీసీ, స్కౌట్ అధికారులు, కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ, పోలీసు కమిషనర్ గౌతమ్‌సవాంగ్, రెవెన్యు, క్రీడాఅధికారులు, యోగా గురువులు, ఎన్‌సీసీ కమాండెంట్ కల్న్‌ల్ రాజు పాల్గొన్నారు.
అలరించిన యోగా విన్యాసాలు
కార్యక్రమంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, విజయవాడలోని వీఎం రంగా నగరపాలక సంస్థ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన యోగా నృత్యాసనాలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయా జిల్లాలకు చెందిన యోగా గురువులను సీఎం సన్మానించారు.
కానరాని ఎమ్మెల్యేలు...
అంతర్జాతీయ యోగా వేడుకలకు నగర మేయర్ కోనేరు శ్రీధర్ మినహా ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కావడంతో వీరెవరూ హాజరుకాలేదని తెలుస్తోంది.
ఘనంగా అంతర్జాతీయ యోగా డే
Published Tue, Jun 21 2016 6:40 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement
Advertisement