- కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
- 29న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో సదస్సు
సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి(జూనియర్ లెవల్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కమిటీ ఆఫ్ సెక్రెటరీస్(సీఓఎస్) సిఫార్సుల మేరకు సెప్టెంబర్ 14న జరిగిన సమావేశంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆమోదం నిమిత్తం పంపింది. కిందిస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూల రద్దుపై అభిప్రాయాలు తెలపాలంటూ గతంలోనే అన్ని రాష్ట్రాల సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపింది. అనంతరం అన్ని రాష్ట్రాల జీఏడీ కార్యదర్శులతో వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు చాలా రాష్ట్రాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయి.
ఏయే పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేయాలనే అంశంపై ఇప్పటికే గుర్తింపు కార్యక్రమం కూడా చేపట్టినట్లు కొన్ని రాష్ట్రాలు పేర్కొన్నాయి. కిందిస్థాయి పోస్టుల భర్తీకి తాము ఇప్పటికే ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు మరికొన్ని రాష్ట్రాలు తెలియజేశాయి. కిందిస్థాయి పోస్టులను ఇంటర్వ్యూలతో సంబంధం లేకుండా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేసేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ డీఓపీటీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ నెల ఏడో తేదీన లేఖలు రాసింది.
ఢిల్లీలో వర్క్‌షాప్: ఇంటర్వ్యూల రద్దుపై ఈ నెల 29న అన్ని రాష్ట్రాల సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాలని డీఓపీటీ నిర్ణయించింది. ఇంటర్వ్యూల రద్దు ప్రతిపాదన/అమలుపై ఈ నెల 29న ఢిల్లీలోని సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్‌షాప్ జరగనుంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల సాధారణ పరిపాలన/ సిబ్బంది విభాగం ముఖ్య కార్యదర్శులు హాజరుకానున్నారు. కిందిస్థాయి పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల రద్దుపై కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. ఇదే అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వవచ్చు. ఈ మేరకు డీఓపీటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు లేఖలు పంపారు.
చిన్నస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూ రద్దు
Published Wed, Oct 21 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM
Advertisement
Advertisement