interview cancel
-
గుడ్‌న్యూస్: గ్రూప్ 1, గ్రూప్ 2 కు ఇంటర్వ్యూ మార్కులూ తొలగింపు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షల్లో ఆ మేర మార్కులనూ తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటివరకు అన్ని పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఉండే గరిష్ట మార్కులు ఉండగా.. ఇక ముందు కేవలం రాతపరీక్షల మొత్తమే గరిష్ట మార్కులు కానున్నాయి. ఈ క్రమంలో గ్రూప్–1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి. చదవండి👉వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు రాతపరీక్షే ఆధారం.. గ్రూప్–1, గ్రూప్–2 కొలువులకు, వైద్యారోగ్య సంస్థల్లో మెడికల్ ఆఫీసర్, ఆపైస్థాయిలో నేరుగా చేపట్టే నియామకాలకు ఇంటర్వ్యూలు, గురుకుల విద్యాసంస్థల్లో బోధన పోస్టులకు సంబంధించి డెమో రౌండ్ ఇప్పటివరకు కీలకంగా ఉండేవి. నియామకాల్లో జాప్యాన్ని నివారించడం, అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం కోసం వీటిని రద్దుచేసి, రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతోపాటు వాటికి సంబంధించిన మార్కులను కూడా తొలగిస్తేనే మంచిదన్న ప్రతిపాదన చేశాయి. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. తగ్గనున్న మార్కులు ► ఇదివరకు గ్రూప్–1 పరీక్షను మొత్తంగా 1000 మార్కులకు నిర్వహించేవారు. అందులో 900 మార్కులకు వివిధ రాతపరీక్షలు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండేవి. ఇక గ్రూప్–2 పరీక్షను 675 మార్కులకు నిర్వహించగా.. అందులో 75 మార్కులు ఇంటర్వ్యూలకు ఉండేవి. ఇప్పుడు ఇంటర్వ్యూల మార్కులను తొలగిస్తే.. గ్రూప్–1 పరీక్ష 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్షను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉంది. ► ప్రస్తుతం గురుకుల విద్యాసంస్థల్లో పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నియామకాల్లో రాతపరీక్షలతోపాటు డెమో (ప్రత్యక్ష బోధన పరీక్ష) ఉంది. ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షలకు ఇంటర్వ్యూలను తొలగించడంతో డెమో విధానానికి స్వస్తి పలకాలని అధికారులు భావిస్తున్నారు. ► ఇప్పటివరకు వైద్యారోగ్య విభాగంలోని కొన్నిపోస్టులకు కేవలం ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు. ఈసారి ఆయా పోస్టుల నియామకాలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంపై బోర్డు కసరత్తు చేస్తోంది. సిలబస్‌లో మార్పులు లేనట్టే! ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూలు తొలగించినందున.. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది. చదవండి👉 ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా! -
ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పలురకాల పోస్టుల భర్తీలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. నిర్దేశించిన పోస్టులకు ఇప్పటివరకు ఇంటర్వ్యూలతో కలిపి అర్హతల నిర్ధారణ జరిగేది. కానీ ప్రస్తుతం మౌఖిక పరీక్షల భాగాన్ని ప్రభుత్వం తొలగించడంతో పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇంటర్వ్యూల రద్దుతో ఆ భాగానికి (పార్ట్) నిర్దేశించిన మార్కులు తొలగించాలా? లేక ఆ మార్కులను రాత పరీక్షలో కలపాలా? అనే అంశంపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు ఇంటర్వ్యూ తొలగింపుపై విద్యారంగ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. రెండు కేటగిరీల్లోనే కాదు.. ఇంటర్వ్యూల నిర్వహణ కేవలం గ్రూప్ ఉద్యోగాలకే పరిమితం కాలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలతో పాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే వైద్యుల నియామకాలు, తెలంగాణ గురుకుల నియామకాల బోర్డు ద్వారా ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి, తదితరాలకు కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయి. మరోవైపు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డెమో పరీక్షలు (తరగతి గదిలో పాఠాలు చెప్పడం) నిర్వహిస్తున్నారు. ఈ డెమో పరీక్షలు కూడా ఇంటర్వ్యూ విధానంలోకే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియలో పలు రకాల మార్పులు అనివార్యం కానున్నట్లు స్పష్టమవుతోంది. అర్హత పరీక్ష తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహించే వైద్యుల నియామకాల్లో కొన్నింటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అర్హతలు నిర్ధారించుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ రద్దు చేస్తే ఈ నియామకాలకు అర్హత పరీక్ష తప్పనిసరి కానుంది. దీంతో వారికి ప్రత్యేకంగా సిలబస్‌ను రూపొందించి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు తెలంగాణ గురుకుల నియామకాల బోర్డు ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ప్రిన్స్‌పల్, జేఎల్, డీఎల్ నియామకాల ప్రక్రియలోనూ మార్పులు తప్పవని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంటర్వ్యూ, డెమోకు బదులుగా ఇతర కేటగిరీల్లో వారి సామర్థ్యాలను పరిశీలించాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. వేగం..పారదర్శకత వివిధ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూలకు సగటున అరగంట సమయం పడుతున్నట్లు బోర్డుల వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గ్రూప్–1 కేటగిరీలో 503 పైగా ఉద్యోగాలున్నాయి. మెయిన్ పరీక్షల అనంతరం 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిస్తే 1,509 మందిని ఇంటర్వ్యూ చేయాలి. ఒక్కో అభ్యర్థిని అరగంట చొప్పున రోజుకు కనీసం 25 మందిని ఇంటర్వ్యూ చేసినా ఈ ప్రక్రియ పూర్తికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఇక గ్రూప్–2 కేటగిరీలో పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వేలల్లో అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటర్వ్యూల నిర్వహణ నియామక సంస్థలకు భారంగా మారుతోంది. ఈ పరిస్థితిని నివారించడం ద్వారా నియామకాల్లో వేగం పెంచడంతో పాటు అవకతకవకలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇంటర్వ్యూ సిలబస్ రాత పరీక్షలో.. గ్రూప్–1 ఉద్యోగ నియామకాల్లో ప్రస్తుతం మూడు అంచెల్లో నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు 900 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులున్నాయి. ఇంటర్వ్యూ రద్దుతో 100 మార్కులు తొలగించినప్పటికీ.. ఇంటర్వ్యూకు నిర్దేశించిన సిలబస్‌ను రాత పరీక్షలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాత పరీక్ష సిలబస్‌లో మార్పులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతమున్న సిలబస్‌ను 2015లో విషయ పరిజ్ఞానం ఉన్న నిష్ణాతులతో కూడిన కమిటీ నిర్ణయించింది. ఇక గ్రూప్–2 నియామకాలకు పార్ట్–ఏ కింద ఆబ్జెక్టివ్ విధానంలో నాలుగు పేపర్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు 600 మార్కులు ఉన్నాయి. పార్ట్–బీలో ఇంటర్వ్యూకు 75 మార్కులున్నాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూకు మినహాయింపు ఇవ్వనుండడంతో అందుకు సంబంధించిన మార్కులు తొలగించి నాలుగు పేపర్లకు నిర్దేశించిన సిలబస్‌కు మరిన్ని అంశాలు అదనంగా జోడించే అవకాశం ఉంది. అపోహలు తొలగిపోతాయి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయడం మంచి పరిణామమే. ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యవహారశైలి, కమ్యూనికేషన్ సామర్ధ్యంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని నేరుగా పరిశీలిస్తారు. కానీ చాలా మందిలో ఇంటర్వ్యూలపై అక్రమాలు జరుగుతాయని, పైరవీలకు ఆస్కారం ఉంటుందనే అపోహలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అపోహలు తొలగిపోతాయి. కేవలం మెరిట్ ఆధారంగా పూర్తి పారదర్శకంగా నియామకాలు జరుగుతాయనే నమ్మకం పెరుగుతుంది. అయితే అర్హత సాధించిన అభ్యర్థికి నియామక పత్రం ఇచ్చే ముందు జరిగే వైద్య పరీక్ష పక్కాగా నిర్వహిస్తే బాగుంటుంది. – ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ప్రిన్స్‌పాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ అన్ని కేటగిరీల్లో పరిశీలించాల్సిందే.. రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగం అంటే గ్రూప్–1. ఈ నియామకాల్లో మౌఖిక పరీక్షలు ఉండడమే మంచిది. గ్రూప్–1 అధికారిపైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, శాఖాపరమైన కార్యక్రమాల నిర్వహణలో అతని పనితనం తెలియాలంటే అన్ని కేటగిరీల్లో అతని సామర్థ్యాలు పరిశీలించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా అన్ని పరీక్షల్లో సామర్థ్యాలను చూడాలి. పైరవీల పేరిట సామర్థ్యాల పరిశీలనను కుదించడంతో సరైన అభ్యర్థుల ఎంపిక సాధ్యమవుతుందా అనేది ఆలోచించాలి. సివిల్స్‌లో ఇంటర్వ్యూ తప్పనిసరనే విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి. – ప్రొఫెసర్ ఎన్.కిషన్, హెచ్ఓడీ, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఓయూ -
గ్రూప్–1, 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేనట్టే! నేడో, రేపో..
సాక్షి, హైదరాబాద్: త్వరలో భర్తీ చేయనున్న గ్రూప్ –1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు (మౌఖిక పరీక్ష) తీసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణులు, టీఎస్పీఎస్సీ అధికారులతో చర్చించి నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే, ఈ నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఫైలును న్యాయ శాఖకు పంపడంతో పాటు కేబినెట్ ఆమోదం అవసరమా.. కాదా.. అనే విషయంలోనూ లోతుగా పరిశీలించాయి. పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పుచేర్పులకు కేబినెట్ ఆమోదం అవసరం లేదని నిర్ధారించుకోవడం, టీఎస్పీఎస్సీ అధికారులతో కూడా జరిపిన సంప్రదింపుల అనంతరం దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు రం గం సిద్ధమైంది. ఇక, ఇప్పటికే 30,453 వేల పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అనంతరం మరో 20 వేల టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వనున్న ట్లు సమాచారం. టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు పరీక్షకు హాజరయ్యేలా డీఎస్సీ ప్రకటనకు మార్గం సుగమం కానుంది. ఉపాధ్యాయ పోస్టులు, ఇప్పటికే పరిపాలన అనుమతులు వచ్చిన పోస్టులు పోను మిగిలిన మరో 30 వేల పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగానే మిగిలిన పోస్టుల భర్తీకి పరిపాలన అనుమతులు ఇచ్చే యోచనలో ముందుకెళుతోంది. -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ..హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాలకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా నిర్ణయంతో.. వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు కాన్సులేట్‌కు వెళ్లి భౌతికంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెచ్-2 వీసా, ఎఫ్-ఎమ్ వీసా, ఎకాడమిక్ జే వీసాలపై ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధనను.. 2022 డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ కాన్సులర్ అధికారులకు విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఆదేశాలు జారీ చేశార. అయితే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులేట్ అధికారులు ఇన్‌పర్సన్ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశముంది. అందువల్ల సంబంధిత వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విదేశాంగశాఖ సూచించింది. చదవండి: విషాదం: నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 32 మంది సజీవ దహనం -
ఏపీ: గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూలు రద్దు
-
ఏపీ: గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూలు రద్దు
సాక్షి, విజయవాడ: గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
గెస్ట్ ఫ్యాకల్టీ ఇంటర్వ్యూలు రద్దు
సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : జిల్లా యూనిట్‌గా బాలయోగి గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం బుధవారం జరగాల్సిన ఇంటర్వ్యూలు రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి ఈ రద్దు ప్రకటన మంగళవారం విడుదల చేసినప్పటికీ అనేక మంది అభ్యర్థులు ఎచ్చెర్లలోని ఇంటర్వ్యూ కేంద్రానికి హాజరయ్యారు. ఒక్కరోజు ముందు ఇంటర్వ్యూలు ఎలా రద్దు చేస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఏటా వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాలో బాలయోగి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు 12 ఉన్నాయి. ఇందులో బాలికలు పాఠశాలలు 8, బాలుర పాఠశాలలు 4 ఉన్నాయి. మొత్తం 107 గెస్ట్ ఫ్యాకల్టీ(అతిథి బోధకులు) అవసరం. పాఠశాల స్థాయి బోధకులకు రూ.14 వేలు, జూనియర్ కళాశాల పరిధిలో పనిచేసే వారికి రూ.18 వేలు వేతనం ఇస్తారు.వాక్ ఇన్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఖరారు చేస్తారు. వీరిని 10 నెలలు కొనసాగిస్తారు.ఈ ఏడాదికి సంబంధించి జిల్లా బాలయోగి గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్టినేటర్ వై.యశోదలక్ష్మి ఇటీవల ప్రకటన విడుదల చేశారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎచ్చెర్ల బాలయోగి గురుకుల పాఠశాలలో బుధవారం ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత వారినే కొనసాగించాలంటూ బాలయోగి గురుకుల రాష్ట్ర కార్యదర్శి రాములు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇంటర్వ్యూల రద్దు ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలితో పాటు విజయంనగరం జిల్లా నుంచి వందలాది మంది అభ్యర్థులు వచ్చారు. ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ముందు రోజు ఎలా ప్రకటిస్తారని స్థానిక ప్రిన్సిపాల్ ఉషారాణిని నిలదీశారు. కార్యదర్శి ఉత్తర్వుల మేరకు రద్దు చేసినట్లు ఆమె స్పష్టం చేయడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. -
చిన్నస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూ రద్దు
- కేంద్ర ప్రభుత్వం నిర్ణయం - 29న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో సదస్సు సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి(జూనియర్ లెవల్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కమిటీ ఆఫ్ సెక్రెటరీస్(సీఓఎస్) సిఫార్సుల మేరకు సెప్టెంబర్ 14న జరిగిన సమావేశంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీఓపీటీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆమోదం నిమిత్తం పంపింది. కిందిస్థాయి పోస్టులకు ఇంటర్వ్యూల రద్దుపై అభిప్రాయాలు తెలపాలంటూ గతంలోనే అన్ని రాష్ట్రాల సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపింది. అనంతరం అన్ని రాష్ట్రాల జీఏడీ కార్యదర్శులతో వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు చాలా రాష్ట్రాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయి. ఏయే పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేయాలనే అంశంపై ఇప్పటికే గుర్తింపు కార్యక్రమం కూడా చేపట్టినట్లు కొన్ని రాష్ట్రాలు పేర్కొన్నాయి. కిందిస్థాయి పోస్టుల భర్తీకి తాము ఇప్పటికే ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు మరికొన్ని రాష్ట్రాలు తెలియజేశాయి. కిందిస్థాయి పోస్టులను ఇంటర్వ్యూలతో సంబంధం లేకుండా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేసేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ డీఓపీటీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ నెల ఏడో తేదీన లేఖలు రాసింది. ఢిల్లీలో వర్క్‌షాప్: ఇంటర్వ్యూల రద్దుపై ఈ నెల 29న అన్ని రాష్ట్రాల సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాలని డీఓపీటీ నిర్ణయించింది. ఇంటర్వ్యూల రద్దు ప్రతిపాదన/అమలుపై ఈ నెల 29న ఢిల్లీలోని సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్లో వర్క్‌షాప్ జరగనుంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల సాధారణ పరిపాలన/ సిబ్బంది విభాగం ముఖ్య కార్యదర్శులు హాజరుకానున్నారు. కిందిస్థాయి పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల రద్దుపై కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనుంది. ఇదే అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వవచ్చు. ఈ మేరకు డీఓపీటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు లేఖలు పంపారు.