ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్
- పోలీసులకు చిక్కని కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులు
- సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు
- రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్
తణుకు(పశ్చిమగోదావరి): వేల్పూరుకు చెందిన వివాహిత వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య చేసుకుని వారం అరుునా ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి కనిపించటం లేదు. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారులపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్, ఆమె కుటుంబ సభ్యులు పరారీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును స్వయంగా పరిశీలించి అడిషినల్ డీజీ ఠాకూర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో ఎస్పీ భాస్కర్‌భూషణ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బుధవారం కూడా ఆయన తణుకులోనే ఉన్నారు. కేసు విషయమై పలువురు అధికారులతో సమీక్షించారు.
విశాఖలో గుడాల?
గుడాల సాయిశ్రీనివాస్ విశాఖలో తలదాచుకున్నాడన్న సమాచారం పోలీసులకు అందింది. ప్రత్యేక బృందాలు ఇప్పటికే నిందితుల వేటలో ఉండగా ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. నేషనల్ హైవే టోల్‌గేట్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా సాయిశ్రీనివాస్ విశాఖపట్టణంలోనే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. విశాఖకు చెందిన బడా వ్యక్తి అతనికి ఆశ్రయం ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. సీసీ ఫుటేజీలో గుడాలతోపాటు కారులో మరో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి వివరాలను సేకరించే పనిలోను పోలీసులు ఉన్నారు. కృపామణి తల్లిదండ్రులు, సోదరుడు కూడా పోలీసులకు చిక్కకపోవడంతో గుడాలతోనే వారూ ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముందస్తు బెయిల్ కోసం...
సాయిశ్రీనివాస్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు బార్ కౌన్సిల్ నేతలతో మాట్లాడి అతనికి బెయిల్ రాకుండా సహకరించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. సాయిశ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే తణుకులోనిన్యాయవాది ఒకరు బుధవారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. సాయిశ్రీనివాస్‌కు గతంలో సహకరించిన వ్యక్తులపైనా పోలీసులు నిఘా ఉంచినట్టు తెలుస్తోంది.
రెండు రోజుల్లో నిందితుల అరెస్ట్
కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులను రెండు రోజుల్లో అరెస్ట్ చేయిస్తామని రాష్ట్ర మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. కృపామణి భర్త, అత్త, కుమారుడిని బుధవారం ఆమె పరామర్శించారు. ఆమె విలేకరులతో మాట్లాడారు. నిందితుడికి పోలీసు ఉన్నతాధికారులు లేదా రాజకీయ నాయకులు సహకరిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో ఎవరినీ విడిచిపెట్టేది లేదన్నారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎస్పీ భాస్కర్ భూషణ్, డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఆత్మకూరి బులిదొరరాజు, వేల్పూరు సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి ఆమె వెంట ఉన్నారు.