తండ్రి నాగపవన్ తో కార్తీక్
తణుకు(పశ్చిమగోదావరి) : వారం రోజులుగా తమ ఇంటి ఆవరణలో పోలీసు బూట్ల చప్పుళ్లు.. ప్రముఖులు, రాజకీయ నాయకుల పరామర్శలు.. తనను చూసి అయ్యో పాపం అంటున్న ఇరుగు పొరుగు.. ఇదంతా ఆ మూడేళ్ల చిన్నారికి వింతగా ఉంది. తన తల్లి కొన్ని రోజులుగా ఎందుకు కనిపించడం లేదేంటి? తనను లాలించి గోరుముద్దలు తినిపించే అమ్మ ఏమైంది? ఇవే ఆ చిన్నారి ప్రశ్నలు. వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుమారుడు మూడేళ్ల కార్తీక్ మాత్రం అమ్మ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.
ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న కార్తీక్ తన తల్లిపై బెంగతో జ్వరం బారిన పడ్డాడు. అమ్మ ఊరెళ్లింది ఇదిగో వచ్చేస్తుంది అని నమ్మిస్తున్న కుటుంబ సభ్యులు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిందనే విషయం చెప్పలేక సతమతమవుతున్నారు. కేసు విచారణలో పోలీసులకు సహకరించేందుకు అతని తండ్రి నాగపవన్‌కుమార్ పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి రావటంతో ఇంటి దగ్గర ఉన్న నానమ్మ వెంకటరమణ ఆ చిన్నారిని సాకుతోంది. టీవీలో తన తల్లి కనిపించిన ప్రతిసారి అమ్మా అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ అమ్మ కావాలని మారాం చేస్తుండటం చూస్తున్న వారి కళ్లూ చెమర్చుతున్నాయి.