పెళ్లిపత్రిక చూపించినా డబ్బులివ్వట్లేదు..
= అమలుకాని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు
=గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు
జూపాడుబంగ్లా(కర్నూలు): ‘సార్.. కొడుకు పెళ్లిపెట్టుకున్నాను. బ్యాంకులో జమ చేసుకున్న డబ్బులను మంజూరు చేయడండి’ అని మొరపెట్టుకున్నా బ్యాంకు అధికారులు కరుణించలేదని షేక్‌హమీద్‌బాషా(గౌండ) ఆవేదన వ్యక్తం చేశాడు. జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన ఈయన తన కొడుకు ఖాదర్‌బాషా వివాహం ఈనెల 27న జరపనున్నాడు. అందుకుగాను ధాన్యం విక్రయించగా వ్యాపారి రూ.80వేల పాతనోట్లను ఇచ్చాడు. దీంతో నోట్లను మార్చుకునేందుకు ఈనెల 10వ తేదీన జూపాడుబంగ్లా ఆంధ్రప్రగతిగ్రామీణ బ్యాంకులోని రెండు ఖాతాల్లో నగదును జమ చేశాడు.
అప్పటి నుంచి బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటిదాకా కేవలం రూ.9వేలు ఇచ్చారు. పెళ్లిసమయం సమీపిస్తుండటంతో శుక్రవారం పెళ్లిపత్రికను తీసుకొని బ్యాంకు మేనేజర్‌కు చూపించి తన ఆవేదనను వెలిబుచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ అనంతయ్య కనుకరించకపోగా తమకు పైనుంచి డబ్బులు అందలేదని ఒట్టిచేతులతో తిప్పిపంపాడని హమీద్‌బాషా ఆరోపించారు. సరుకులు తీసుకొన్న వారి ఖాతా నెంబర్లు సేకరిస్తే వారికి తమ బ్యాంకు నుంచి డబ్బులను జమ చేస్తామని మేనేజర్ సలహా ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు.