బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ... | IPL betting going on in the district .. | Sakshi
Sakshi News home page

బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ...

Published Mon, May 23 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ...

బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ...

చిత్తూరు జిల్లాలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్..
రోజుకు రూ.10 కోట్ల వరకు  అమాయకుల జేబులు ఖాళీ
జిల్లాలో మొత్తం 25 మంది బుకీలు?
నియంత్రించలేకపోతున్న పోలీసులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై జిల్లాలో బెట్టింగుల పర్వం జోరుగా సాగుతోంది. లీగ్ ప్లేఆఫ్ దశకు చేరడంతో ముఖ్యమైన టీంలపై లక్షల్లో బెట్లు కట్టేందుకు కూడా యువకులు వెనకాడడం లేదు. రెట్టింపు స్థాయిలో డబ్బు ఎర చూపి బుకీలు అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 25 మంది బుకీలు చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిష్టవేసి కోట్ల రూపాయలు హాంఫట్ చేస్తున్నట్లు సమాచారం.

 

చిత్తూరు: ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ పలువురు నిమిషాల్లో వేలు సంపాదిస్తుంటే.. మరికొంద రు బికారులుగా మారుతున్నారు. జిల్లావ్యాప్తంగా కోట్లలో బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం ఉన్నా.. తగినంత మంది సిబ్బంది లేక బెట్టింగును వారు నియంత్రించలేకపోతున్నారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి బెట్టింగ్ రాయుళ్లు తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాళ్యం, పుత్తూరు, పుంగనూరులకు వచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ చేసే విషయం, ఆ ముఠా తీసుకునే జాగ్రత్తలు తెలుసుకుంటే ఎవరైనా విస్మయానికి గురికావాల్సిందే.

 
అమాయకులే టార్గెట్..

క్రికెట్ బెట్టింగ్ ద్వారా రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చని బుకీలు అమాయకులకు వల వేస్తున్నారు. కొందరు యు వకులు ఈ రొంపిలో దిగి వదులుకోలేకపోతున్నారు. దీంతో  బెట్టింగ్ ముఠా జేబులు నిండుతున్నాయి. అమాయకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. బెట్టింగ్‌కు పాల్పడే రెండు పార్టీల నుంచి బుకీలు కమీషన్ తీసుకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లాలో సుమారు 25 మంది బుకీలు పని చేస్తున్నట్లు సమాచారం. వీరు కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి ఈ తంతును నడిపిస్తున్నారని తెలుస్తోంది.

 
వీరందరూ తమకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. బెట్టింగ్ చేయాలనుకునే వారి నుంచి ముందస్తు రుసుం వసూలు చేసి సభ్యత్వం కల్పిస్తున్నారు. ఒక కంప్యూటర్, పదుల సంఖ్యలో సెల్‌ఫోన్లు అందుబాటులో ఉంచుకొని జోరుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.  ఏవిధంగా బెట్టింగ్ కట్టాలనుకుంటున్నారో సభ్యులు చెబితే వారు అదే విధంగా బెట్టింగ్ కట్టాలనుకునే వారితో ఒప్పందం కుదురుస్తారు. వీటిని ఎక్కడా రికార్డు చేయరు. కేవలం కోడ్ బాషను మాత్రమే ఉపయోగిస్తారు. మ్యాచ్ ఓడిన వారి నుంచి మరుసటి రోజు డబ్బులు వసూలు చేసి కమీషన్ పట్టుకొని మిగతా సొమ్మును పక్కాగా గెలిచిన వారికి అందిస్తున్నారు.

 
అద్దె ఇళ్లు, టైలరింగ్ షాపులు..

బెట్టింగ్ నిర్వహించాలంటే కచ్చితంగా కంట్రోల్ రూం ఉండాల్సిందే. ఒకప్పుడు వీరు పెద్దపెద్ద హోటళ్లలో కార్యకలాపాలు చేస్తుండే వారు. వీరి గుట్టు అందరికీ తెలియడంతో చిన్నచిన్న అద్దె గృహాలు, మొబైల్ వాహనాలు, టైలరింగ్ షాపుల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే హైఫై ముఠా మొబైల్ వాహనాల్లో కథ నడిపిస్తున్నారు. సుమో, స్కార్పియో లాంటి వాహనాలకు డీ2హెచ్‌లను అమర్చుకొని డీల్స్ ఓకే చేస్తున్నారు. ఈ వాహనం ఒకే చోట కాకుండా జిల్లా మొత్తం తిరుగుతుంది. బెట్టింగ్ విషయాలు బయటికి పొక్కకుండా కేవలం ఫోన్‌లో మాత్రమే మాట్లాడతారు. మెసేజ్‌లు పెడతారు. తమ సభ్యుల్లో ఎవరిపైనైనా అనుమానం వారితో వెంటనే కార్యకలాపాలు ఆపేస్తారు. ఫోన్ నంబర్ మార్చి మిగతా సభ్యులకు కొత్త నంబర్ తెలియజేస్తారు.

 
ఎవరూ నోరు మెదపడం లేదు..

సాధారణంగా జూదంలో ఓడిపోయిన వాడే పోలీసులకు సమాచారం ఇస్తాడు. దీని ద్వారా పోలీసులు చర్య లు తీసుకుంటారు. అయితే బెట్టింగ్ విషయంలో ఈ విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి. బెట్ ఏంటన్నది బుకీలే బయటపెడతారు. బుకీలు ఎక్కడి నుంచి వ్యవహారం నడిపిస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. వ్యవహారం మొత్తం రహస్యం. దీన్ని ఎవరూ దాటడానికి వీల్లేదు. దాటితే వారికపై కఠిన చర్యలు ఉంటాయి. చంపడానికైనా వెనకాడరు. ఒక వేళ ఓడిపోయిన వ్యక్తి బెట్టింగ్ మొత్తం చెల్లించకపోతే...మరోసారి బెట్టింగ్ చేయడానికి అతడు అనర్హుడు. ఇంకో బెట్టింగ్ ముఠా కూడా అతనిన బెట్టింగ్‌కు సభ్యత్వం ఇవ్వదు. దీనికోసం వారు సరికొత్త సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నారు. కొత్తవారు సభ్యులుగా చేరాలంటే పాత సభ్యుడి సిఫారసు ఉండాల్సిందే.

 
ప్రొటోకాల్ పాటించడానికే..

ప్రొటోకాల్ పాటించడానికే సమయం మొత్తం సరిపోతోందని.. మరి ఇలాంటి విషయాలపై దృష్టిపెట్టడానికి టైమ్‌లేదని పోలీసులు వాపోతున్నారు. జిల్లా మొత్తం దాదాపు 3600 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లా జనాభా 40 లక్షలు పైనే. ఈ లెక్కన ప్రతి 1111 మందికి ఒక పోలీసు ఉంటారు. జనాభా పెరుగుతున్నా పోలీసు నియామకాలపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనికి తోడు ఉన్న వారిపై పనిభారం పెరుగుతుండటంతో నేరాల కట్టడి అంతంత మాత్రంగానే  ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement