స్వేచ్ఛకు సంకెళ్లు ! | ippala ravindra arrest | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛకు సంకెళ్లు !

Published Sat, May 27 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

స్వేచ్ఛకు సంకెళ్లు !

స్వేచ్ఛకు సంకెళ్లు !

– సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై సర్కారు కక్ష
– జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారంటూ ఇప్పాల రవీంద్ర అరెస్టు
– జేసీపీఆర్‌ బహిరంగంగానే దుర్భాషలాడినా చేష్టలుడిగిన ప్రభుత్వం
– రవీంద్ర అరెస్టు భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనంటున్న నెటిజన్లు, మేధావులు


(సాక్షిప్రతినిధి, అనంతపురం)
    సోషల్‌ మీడియా.. సమాజంలోని ప్రతి అంశంపై ఎవరి అభిప్రాయాలను వారు తెలియజేసేందుకు చక్కటి వేదిక! ఇంతకుముందు చర్చలు, విమర్శలు, అభిప్రాయాలకు పత్రికలు, టీవీ ఛానెళ్లు మాత్రమే ప్రధాన మాధ్యమంగా ఉండేవి. స్మార్ట్‌ఫోన్ల వాడకం విరివిగా పెరిగిన తర్వాత చాలామంది సోషల్‌ మీడియాను కూడా ఇందుకు వేదికగా చేసుకుంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సామాజిక వెబ్‌సైట్లు ఇందుకు దోహదపడుతున్నాయి. సోషల్‌ మీడియాలో అభిప్రాయాలు పంచుకునే, చర్చలు సాగించేవారి సంఖ్య మూడేళ్లలో భారీగా పెరిగింది. వీరు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తపరుస్తున్నారు. నచ్చిన వాటిని  కొందరు షేర్‌ చేస్తున్నారు. మరికొందరు ‘లైక్‌’ కొడుతున్నారు. సదరు అంశంపై ఇంకొందరు ‘కామెంట్‌’ పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వాలు దీన్ని గౌరవిస్తూ వస్తున్నాయి. అయితే.. టీడీపీ ప్రభుత్వం మాత్రం విమర్శలను స్వీకరించలేకపోతోంది. విమర్శించే పత్రికలు, టీవీలపై ఇన్నాళ్లూ ఒంటికాలితో లేచిన టీడీపీ నేతలు.. ఇప్పుడు నెటిజన్ల విమర్శలను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిని అరెస్టులు చేస్తున్నారు.

జేసీపై పోస్టులు చేశారని రవీంద్ర అరెస్టు
ఇప్పాల రవీంద్ర అనే వ్యక్తి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఈయన ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు వైరల్‌ చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉంచారు. కాగా..తాడిపత్రి ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్‌రెడ్డిపైనా రవీంద్ర సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాడిపత్రి  జెడ్పీటీసీ సభ్యురాలు సావిత్రి ఈ ఏడాది మార్చి ఏడున తాడిపత్రి ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ కేసును తాడిపత్రి టౌన్‌ పోలీసుస్టేషన్‌కు కోర్టు బదిలీ చేసింది. ఈ క్రమంలో మార్చి 8న పోలీసులు కేసు నమోదు (క్రైం నంబర్‌ 78/17) చేశారు. అయితే.. కేసు నమోదు చేసినప్పటికీ రవీంద్రను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ జేసీ వర్గీయులకు చెందిన ‘తాడిపత్రి సమాచార్‌’ పత్రికలో గురువారం కథనం వచ్చింది. ఇదేరోజు తాడిపత్రి పోలీసులు విశాఖకు బయలుదేరారు. శుక్రవారం అక్కడి జైలు సూపరింటెండెంట్‌ను కలిసి రవీంద్రను కస్టడీలోకి తీసుకున్నారు. కథనం ప్రచురితమైన రోజే పోలీసులు స్పందించి వెళ్లారంటే రవీంద్రను తాడిపత్రికి తీసుకొచ్చేందుకు వ్యూహం రచించి, దాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జేసీపై చర్యలేవీ?
సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసినందుకు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు.. రాష్ట్ర ప్రతిపక్ష నేతను వ్యక్తిగతంగా, పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జేసీ వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని, ఇతను మా ఎమ్మెల్యే అని చెప్పుకునేందుకే సిగ్గుగా ఉందని ప్రజలు చర్చించుకున్నారు. కొందరు ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ సెల్‌ఫోన్‌లతో వీడియోలు తీసి..వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి నిరసన తెలియజేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. ప్రతిపక్ష నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి జేసీ ప్రభాకర్‌పై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇందుకు కారణం ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కావడమే! రవీంద్ర సామాన్య వ్యక్తి కాబట్టే ఆయనపై అధికార, పోలీసు జులుం ప్రదర్శిస్తున్నారు.      

అరెస్టులపై నెటిజన్ల మండిపాటు
రవీంద్రను అరెస్టు చేయడంపై ‘అనంత’ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన్ను తాడిపత్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారనే సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసుల తీరును సర్వత్రా ఖండిస్తున్నారు. ఈ అరెస్టు భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. అరెస్టులతో సోషల్‌ మీడియాను కట్టడి చేయలేరని,  మంచిని అభినందించడం, తప్పును ఎత్తిచూపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని చెబుతున్నారు. రవీంద్ర అరెస్టును మేధావులు, విద్యార్థులు, సామాజికవేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతిపక్ష నేతపై పరుష వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి గానీ.. సామాన్యులపై కాదని పోలీసులు, ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement