tadipatri mla
-
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: బీఎస్–3 వాహనాలను బీఎస్-4గా మార్చి నడుపుతున్నారన్న ఫిర్యాదుపై ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులు, సీబీఐతో పాటు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. టీడీపీ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బీఎస్–3 వాహనాలను బీఎస్–4గా మార్చి నడపడంపై తాను 2020 అక్టోబర్ 12న రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదంటూ ఏపీలోని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అక్రమాలు తేలడంతో పలు వాహనాలను సీజ్ చేశారని పేర్కొన్నారు. చదవండి: తీవ్ర వాయుగుండం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు తెలంగాణలో మాత్రం వాహనాలను అక్రమంగా నడుపుతున్నారని వివరించారు. ఇది సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై విచారణ జరిపి కేసు నమోదు చేసేలా అధికారులను ఆదేశించాలని.. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం ప్రతివాదులైన రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐతో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబరు 12కు వాయిదా వేశారు. -
పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి జులుం
తాడిపత్రి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై జులుం ప్రదర్శించారు. ఆగ్రహంతో ఊగిపోతూ చిందులు తొక్కారు. టీడీపీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టణంలోని ఒకటో వార్డులో పర్యటించేందుకు నివాసం నుంచి బయల్దేరారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి లేనిదే వార్డుల్లో పర్యటించకూడదని పోలీసులు ఆయన్ను ఒకటో వార్డు గాందీనగర్ వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. డీఎస్పీ వీఎన్కే చైతన్య జోక్యం చేసుకుని.. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని స్పష్టంచేశారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పంపించివేశారు. ఇదీ చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ.. నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు -
రెండు కోట్ల డైమండ్ నెక్లెస్.. జేసీ అక్రమ ఆస్తులు చూసి ఈడీ షాక్
-
ఆదర్శ మున్సిపాలిటీలో అక్రమాలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్..!
సాక్షి, తాడిపత్రి: ‘పేరుకే తాడిపత్రి ఆదర్శ మున్సిపాలిటీ. జరిగేదంతా దోపిడీ, అక్రమాలే. షాపింగ్ కాంప్లెక్స్ లీజు, అద్దె బకాయిలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు స్వాహా చేయడమేంటి?’ అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ అధికారుల తీరుపైనా అసహనం ప్రదర్శించారు. షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు, లీజుదారులతో శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించారు. మున్సిపాలిటీకి గుడ్‌విల్, అద్దెల రూపంలో చెల్లించిన లక్షలాది రూపాయల్లో సగానికే రసీదులు ఇచ్చి.. మిగతా సొమ్మును సంస్థకు జమ చేయకుండా స్వాహా చేశారని తేలింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి శీనాకు అద్దె మొత్తాలు ఇస్తే తమకు రసీదులు కూడా ఇవ్వలేదని పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ► షాప్ అద్దెకు సంబంధించి రూ.13 లక్షలను క్యాషియర్ రాజేష్‌కు చెల్లిస్తే రూ.8.50 లక్షలకు మాత్రమే రసీదు ఇచ్చాడని జి.రవీంద్రారెడ్డి తెలిపాడు. ► గుడ్‌విల్ కింద తనవద్ద నుంచి రూ.11లక్షలు అవుట్సోర్సింగ్ ఉద్యోగి శీనా తీసుకుని, రూ.8.50 లక్షలకు మాత్రమే రసీదు ఇచ్చాడని, మిగతా మొత్తం గురించి అడిగితే పెన్నానది ఒడ్డున ఏర్పాటు చేసే పార్కు అభివృద్ధి కోసం వినియోగించుకుంటామని చెప్పాడని రంగస్వామి చెప్పాడు. ► పార్కు నిర్మిస్తున్నామంటే మున్సిపాలిటీకి రూ.11లక్షలు చెల్లించానని, అయితే తనకు రూ.8.50 లక్షలు మాత్రమే షాపు అద్దె చెల్లించినట్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగి రసీదు ఇచ్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే అన్న(మాజీ ఎమ్మెల్యే జేసీపీఆర్)ను వచ్చి అడగాలని చెప్పడంతో చేసేదిలేక మిన్నకుండిపోయామని ఖాజామొహిద్దీన్ ఆరోపించాడు. మున్సిపాలిటికీ చెల్లించాల్సిన అద్దె, లీజు, గుడ్‌విల్ మొత్తాన్ని నవంబర్ మొదటి వారం లోపు చెల్లించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. చెల్లించలేని పక్షంలో వెంటనే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వేలం డబ్బు చెల్లించకనే షాపులు ఎలా కేటాయిస్తారు? వేలంలో షాపులు దక్కించుకున్న వారి నుంచి డబ్బు వసూలు చేయకుండానే షాపులు కేటాయించడమేంటని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీ రోడ్డులో జేసీఎన్ఆర్ఎం కాంప్లెక్స్‌లో జేసీ దివాకర్ పేరుతో ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. వేలం పాటలో షాపు దక్కించుకున్నారు. వేలం మొత్తాన్ని చెల్లించకుండా అధికార బలంతో షాపును స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. ఇప్పటి వరకు ఆ షాప్‌కు సంబంధించి రూ.లక్షకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంది. వెంటనే నోటీసులు జారీ చేసి అద్దె డబ్బు వసూలు చేయాలని, లేనిపక్షంలో దివాకర్ ట్రావెల్స్‌ను సీజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. పార్కు ఏర్పాటు పేరుతో మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉంటున్న దుకాణాల యజమానుల నుంచి భారీగా రూ.లక్షల్లో వసూలు చేసి కొంత మాత్రమే మున్సిపాలిటీకి చెల్లించారని, మిగిలిన మొత్తాన్ని జేసి సోదరులు స్వాహా చేశారని మండిపడ్డారు. జేసీ సోదరులు మున్సిపాలిటీని అడ్డుపెట్టుకొని దోచుకున్నదంతా నయా పైసాతో సహా వసూలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్వాహా చేసిన వారిపై ఫిర్యాదు షాపుల అద్దెల మొత్తాన్ని మున్సిపాలిటీకి చెల్లించకుండా స్వాహా చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి శీనా, క్యాషియర్ రాజేష్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దె డబ్బు స్వాహాలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో విచారణ జరపాలని కోరారు. -
జేసీ దౌర్జన్యం
-
ఎమ్మెల్యే జేసీ బూతు పురాణం
అనంతపురం రూరల్: ‘‘నమస్తే అన్నా.. నేను మల్లిని.. అనంతపురం ఉంచి ఫోన్ చేస్తున్నా.. చెప్పప్పా (ఎమ్మెల్యే జేసీ).. అన్నా నా షాపన్నా.. ఇద్దరు కొడుకులన్నా (బాధితుడు).. ‘రేయ్ పగల... ఇస్తాను.. రేపు తీసుకో.. (జేసీ ఆగ్రహం).’’ అగ్రిమెంట్ గడువు ముగియడంతో దుకాణం అప్పజెప్పమని కోరిన బాధితునితో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అసభ్య పదజాలంతో జరిపిన ఫోన్ సంభాషణ ఇది. దుకాణాన్ని ఖాళీ చేయాలని కోరడంతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యం చేశారని అనంతపురంలోని అంబారపు వీధికి చెందిన మల్లికార్జున ఆచారీ ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం భార్య రమాదేవి, కుమారులు ఓబుళాచారి, మంజునాథాచారితో కలిసి మల్లికార్జున తన గోడు చెప్పుకున్నారు. సుభాష్‌రోడ్డులోని నందిని హోటల్ ఎదురుగా తమకు వారసత్వంగా వచ్చిన షాపును 2000 సంవత్సరంలో బాబయ్య అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చామన్నారు. ఆ వ్యక్తి జేసీ బ్రదర్స్‌తో కలిసి కొన్నేళ్లుగా ‘జేసీ ట్రావెల్స్’ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడన్నారు. అగ్రిమెంట్ గడువు ముగియడంతో షాపు ఖాళీ చేయాలని తాము కోరితే ఖాళీ చేయడంలేదన్నారు. ఫోన్లో ఎంత ప్రాధేయపడ్డా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వినకపోగా బండ బూతులు తిట్టారని ఫోన్ సంభాషణను విలేకరులకు వినిపించారు. ఇదే విషయాన్ని ఎస్పీ, డీఐజీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్నారు. నేరుగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలిసి బతిమాలినా కనికరం చూపలేదన్నారు. షాపు వదిలేదే లేదు.. నీ ఇష్టమొచ్చింది చేసుకో అంటూ బండబూతులు తిడుతూ గెంటేశారని మల్లికార్జున ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాణ భయంతో కోర్టును కూడా ఆశ్రయించలేకపోతున్నామని.. అధికారులు, పోలీసులు స్పందించి తమ షాపును తమకు ఇప్పించాలని ఆయన వేడుకున్నారు. -
కలకలం రేపుతున్న జేసీ ఆడియో టేపులు
సాక్షి, అనంతపురం : తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన కమర్షియల్ కాంప్లెక్స్‌ను జేసీ కబ్జా చేశారని మల్లిఖార్జున చారి అనే బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. జేసీ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని బాధితుడు కోరాడు. బాధితుడు ఫిర్యాదులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైలెంట్‌గా ఉండకపోతే, ఆ భవనాన్ని కూల్చివేస్తానంటూ బాధితుడికి ఫోన్లో హెచ్చరించాడు. బాధితుడిని జేసీ బెదిరించిన ఫోన్ ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. జేసీ బెదిరింపులపై తాను కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మల్లిఖార్జున చారి ఆరోపించాడు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. జేసీ కబ్జాలో ఉన్న భవనాన్ని తనకు అప్పగించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడి హెచ్చరిస్తున్నాడు. -
ఎమ్మెల్యే జేసీపై అట్రాసిటీ కేసు
పెద్దపప్పూరు : అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం తాడిపత్రి ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదయింది. గత నెల 24న జూటూరు వద్ద ఆర్డీఓ పర్మిషన్తో తాడిపత్రి మండలంలోని చిన్నపడమల వద్దనున్న శ్రీకృష్ణ ప్రభోదానంద ఆశ్రమం నిర్మాణానికి కావాల్సిన ఇసుక తీసుకొని వెళ్తున లారీని జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్దపప్పూరుకు వస్తూ పోలీసులకు అప్పగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ దాసరి వెంకటేష్‌ను కులం పేరుతో దూషించినట్లు బాధితుడు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసారు. హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు పెద్దపప్పూరు స్టేషన్లో ఎంఎల్ఏపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ శ్రీహర్షను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
స్వేచ్ఛకు సంకెళ్లు !
– సోషల్ మీడియా యాక్టివిస్టులపై సర్కారు కక్ష – జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారంటూ ఇప్పాల రవీంద్ర అరెస్టు – జేసీపీఆర్ బహిరంగంగానే దుర్భాషలాడినా చేష్టలుడిగిన ప్రభుత్వం – రవీంద్ర అరెస్టు భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమేనంటున్న నెటిజన్లు, మేధావులు (సాక్షిప్రతినిధి, అనంతపురం) సోషల్ మీడియా.. సమాజంలోని ప్రతి అంశంపై ఎవరి అభిప్రాయాలను వారు తెలియజేసేందుకు చక్కటి వేదిక! ఇంతకుముందు చర్చలు, విమర్శలు, అభిప్రాయాలకు పత్రికలు, టీవీ ఛానెళ్లు మాత్రమే ప్రధాన మాధ్యమంగా ఉండేవి. స్మార్ట్ఫోన్ల వాడకం విరివిగా పెరిగిన తర్వాత చాలామంది సోషల్ మీడియాను కూడా ఇందుకు వేదికగా చేసుకుంటున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సామాజిక వెబ్సైట్లు ఇందుకు దోహదపడుతున్నాయి. సోషల్ మీడియాలో అభిప్రాయాలు పంచుకునే, చర్చలు సాగించేవారి సంఖ్య మూడేళ్లలో భారీగా పెరిగింది. వీరు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తపరుస్తున్నారు. నచ్చిన వాటిని కొందరు షేర్ చేస్తున్నారు. మరికొందరు ‘లైక్’ కొడుతున్నారు. సదరు అంశంపై ఇంకొందరు ‘కామెంట్’ పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వాలు దీన్ని గౌరవిస్తూ వస్తున్నాయి. అయితే.. టీడీపీ ప్రభుత్వం మాత్రం విమర్శలను స్వీకరించలేకపోతోంది. విమర్శించే పత్రికలు, టీవీలపై ఇన్నాళ్లూ ఒంటికాలితో లేచిన టీడీపీ నేతలు.. ఇప్పుడు నెటిజన్ల విమర్శలను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిని అరెస్టులు చేస్తున్నారు. జేసీపై పోస్టులు చేశారని రవీంద్ర అరెస్టు ఇప్పాల రవీంద్ర అనే వ్యక్తి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఈయన ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు వైరల్ చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉంచారు. కాగా..తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపైనా రవీంద్ర సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తాడిపత్రి జెడ్పీటీసీ సభ్యురాలు సావిత్రి ఈ ఏడాది మార్చి ఏడున తాడిపత్రి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ కేసును తాడిపత్రి టౌన్ పోలీసుస్టేషన్‌కు కోర్టు బదిలీ చేసింది. ఈ క్రమంలో మార్చి 8న పోలీసులు కేసు నమోదు (క్రైం నంబర్ 78/17) చేశారు. అయితే.. కేసు నమోదు చేసినప్పటికీ రవీంద్రను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ జేసీ వర్గీయులకు చెందిన ‘తాడిపత్రి సమాచార్’ పత్రికలో గురువారం కథనం వచ్చింది. ఇదేరోజు తాడిపత్రి పోలీసులు విశాఖకు బయలుదేరారు. శుక్రవారం అక్కడి జైలు సూపరింటెండెంట్‌ను కలిసి రవీంద్రను కస్టడీలోకి తీసుకున్నారు. కథనం ప్రచురితమైన రోజే పోలీసులు స్పందించి వెళ్లారంటే రవీంద్రను తాడిపత్రికి తీసుకొచ్చేందుకు వ్యూహం రచించి, దాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీపై చర్యలేవీ? సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసినందుకు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు.. రాష్ట్ర ప్రతిపక్ష నేతను వ్యక్తిగతంగా, పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జేసీ వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని, ఇతను మా ఎమ్మెల్యే అని చెప్పుకునేందుకే సిగ్గుగా ఉందని ప్రజలు చర్చించుకున్నారు. కొందరు ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ సెల్ఫోన్లతో వీడియోలు తీసి..వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి నిరసన తెలియజేశారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. ప్రతిపక్ష నేతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి జేసీ ప్రభాకర్‌పై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇందుకు కారణం ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కావడమే! రవీంద్ర సామాన్య వ్యక్తి కాబట్టే ఆయనపై అధికార, పోలీసు జులుం ప్రదర్శిస్తున్నారు. అరెస్టులపై నెటిజన్ల మండిపాటు రవీంద్రను అరెస్టు చేయడంపై ‘అనంత’ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన్ను తాడిపత్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరును సర్వత్రా ఖండిస్తున్నారు. ఈ అరెస్టు భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. అరెస్టులతో సోషల్ మీడియాను కట్టడి చేయలేరని, మంచిని అభినందించడం, తప్పును ఎత్తిచూపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని చెబుతున్నారు. రవీంద్ర అరెస్టును మేధావులు, విద్యార్థులు, సామాజికవేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతిపక్ష నేతపై పరుష వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి గానీ.. సామాన్యులపై కాదని పోలీసులు, ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. -
కేంద్రానికి జేసీ ప్రభాకర్ వార్నింగ్
అనంతపురం: తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర విభజన వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఇచ్చే ప్యాకేజీలో తమ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇవ్వకుంటే పార్టీలకతీతంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాయలసీమకు న్యాయం చేయాలన్నారు.