
క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపండి
– క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశం
కర్నూలు: క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్లపై నిఘా తీవ్రతరం చేసి ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాదర్బార్‌కు వచ్చే ఫిర్యాదులపై స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్యాయం జరిగే చోట పోలీసులు బాధితులకు అండగా ఉండి, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విధి నిర్వహణలో కర్నూలు పోలీసులు రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసులుగా ఉండాలన్నారు. వీవీఐపీలు వచ్చే ప్రాంతాలకు పూర్తిగా రక్షణ కల్పించాలని ఆదేశించారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో సైబర్ నేరాలపై పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. మహిళల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశమున్నందున నిఘాను తీవ్రతరం చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధ్యతాయుతంగా పనిచేసి పోలీసు అధికారులు యూనిఫాం గౌరవం కాపాడాలన్నారు. కేబుల్ సమస్యలపై స్పందించాలన్నారు.
ఆదోనిలో సీసీ కెమెరాల పనితీరు భేష్:
ఆదోనిలో సీసీ కెమెరాల పనితీరు చాలా బాగుందని, కర్నూలు, నంద్యాలలో కూడా ఆదోని తరహాలో మెరుగుపరిచేందుకు మున్సిపల్ అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రివేళల్లో అనుమానితులపై నిఘా ఉంచి బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలి, ఓఎస్‌డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు బాబుప్రసాద్, డి.వి.రమణమూర్తి, కొల్లి శ్రీనివాసులు, వెంకటాద్రి, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, రామచంద్ర, ఈశ్వర్‌రెడ్డి, డీపీఓ ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.