ముందస్తు నీరు... అందని తీరు
ముందస్తు నీరు... అందని తీరు
Published Fri, Jun 9 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
- వారం రోజులు దాటుతున్నా డెల్టాలో చేలుకు చేరని కాలువ నీరు
- ప్రశ్నార్థకంగా మారిన 4.80 లక్షల ఎకరాల్లో సాగు
- - మడి తడవక రైతులు సతమతమవుతుంటే
ఏరువాకంటూ పాలకులు హడావుడి
అమలాపురం : ‘నీరు పల్లమెరుగ’ంటారు...నిజమే. కానీ ఆ సహజ సూత్రాన్నే మార్చేస్తున్నారు నేటి పాలకులు... నీటి పారుదల అధికారులు. డెల్టా కాలువ పరిస్థితి చూస్తే అది నిజమేనని రుజువవుతోంది. డెల్టా కాలువలకు నీరు విడిచిపెట్టి ఎనిమిది రోజులవుతున్నా కోన సీమ ప్రాంతంలోని పల్లంలో ఉండే కాలువలకు కూడా నీరు చేరడం లేదు ... మడి తడవడం లేదు. ఓ వైపు నీరు రాక ... సాగు కాక సతమతమవుతుంటే ప్రభుత్వం మరో వైపు ఏరువాకంటూ ఆర్భాటం చేయడం చూసి డెల్టా రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు.
గోదావరి డెల్టాలో ఈ ఏడాది ముందస్తు సాగు కోసమంటూ అధికారులు జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేశారు. ప్రధాన పంట కాలువల నుంచి ఛానల్స్, వాటి నుంచి పంట బోదెలకు, వాటి ద్వారా చేలకు చేరడానికి సాధారణంగా నాలుగైదు రోజులు పడుతుంది. శివారు ఆయకట్టుకు వారం రోజుల్లో చేరుతుంది. కానీ ఈసారి కాలువలకు నీరు వదిలి వారం రోజులు దాటుతున్నా ప్రధాన పంట కాలువలను, ఛానల్స్‌ను ఆనుకుని ఉన్న చేలకు నీరు చేరకపోవడం గమనార్హం. ఆధునికీకరణ, నీరు–చెట్టు పనులు పేరుతో ప్రధాన పంట కాలువలకు అడ్డుకట్టు వేసి దిగువునకు నీరు వెళ్లకుండా చేశారు. దీంతో రెండు డెల్టాలో సుమారు 4.80 లక్షల ఎకరాల్లో ముందస్తు ఖరీఫ్ సాగు అనేది లేకుండాపోయింది. నీరు విడుదలైనా పలుచోట్ల నిలిపివేయడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తడం, విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 7వ తేదీన ‘సస్యశ్యామలంపై స్వార్థపు చీడ’ అనే కథనం రావడంతో అధికారులు హడావిడిగా కాలువలకు వేసిన అడ్డుకట్టలు తొలగించి కిందదకు నీరు వదిలారు. దిగువున ఛానల్స్, పంట బోదెలపై ఇంకా పనులు జరుగుతూనే ఉండడం గమనార్హం. చాలా పనులు వారం, పది రోజులు క్రితం మొదలు కావడం చూస్తుంటే ముందస్తుగా సాగునీరు విడుదల చేయడంపై అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో ఆర్థం చేసుకోవచ్చు. పనులు పేరుతో ఛానల్స్, పంట బోదెలపై పనులు చేస్తూ నీరుకు అడ్డుకట్టు వేయడంతో చేలకు నీరు చేరడం లేదు. తూర్పు, మధ్య డెల్టాలో పరిస్థితి చూస్తేంటే మరో వారం రోజుల వరకు శివారుకు సాగునీరందే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే ఖరీఫ్‌కు ముందస్తు సాగుకు నీరంటూ పాలకులు చేసిందంతా ప్రచారమే తప్ప వాస్తవం కాదనిపిస్తోంది.
పని మొదలు పెట్టి వారమే అయింది
మధ్య డెల్టాలో కీలకమైన విలస ఛానల్ ఇది. దీనిపై ముక్తేశ్వరం, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్‌కు నీరు వచ్చినా సిరిపల్లి లాకుల వద్ద పనులు జరుగుతుండడంతో ఇదిగో ఇలా లాకులు మూసి దిగువున పనులు చేస్తున్నారు. దీంతో ఒకటో తారీఖున నీరు ఇచ్చినా ఈ ప్రాంత రైతులకు 15 వరకు నీరందే అవకాశం లేదు.
రిటైనింగ్ వాల్ కోసం నీరు వదల్లేదు...
ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ నుంచి ముమ్మిడివరం పరిసర ప్రాంతాలకు సాగునీరందించే ఠానేల్లంక ఛానల్‌ల్లో చుక్కనీరు లేదు. ఆయిల్ ఇండియా నిధులు రూ.1.20 కోట్లతో ఇక్కడ ఛానల్‌కు లాంగ్ రివిట్‌మెంట్ పనులు చేస్తున్నారు. ఈ కారణంగా నీరు నిలిపివేశారు. దీనిపై సుమారు 700 ఎకరాల ఆయకట్టు ఉంది. పైగా ఈ ఛానల్ ఎగువున పనులు చేస్తున్నా.. దిగువున కనీసం పూడిక తొలగించకపోవడంతో నీరు సరఫరా సాఫీగా జరుగుతుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు.
Advertisement