కావడి కష్టాలన్నీ పంట కోసమే
మిరపరైతుల భగీరథ ప్రయత్నం
అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు):
రైతులకు ఈ ఏడాది కూడా సాగునీటి కష్టాలు తప్పలేదు. కన్నబిడ్డల్లాంటి పంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సాగర్ జలాలు రాక, వర్షాలు లేక వాగులు, కుంటలు ఎండి పోవటంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. దేవుడిపై భారం వేసి రైతులు మిర్చి మొక్కలు నాటుతున్నారు. ఎక్కడా నీరు లేక పోవటంతో బావుల నుండి, బోరుల నుంచి పొలం దగ్గర కుంటలను ఏర్పాటు చేసుకొని నీటిని నింపుకుంటున్నారు. చెమటోడ్చి అక్కడి నుంచి కావిళ్లతో, బిందెలతో నీటిని తెచ్చుకొంటున్నారు. దీని కోసం రైతులను మొదట్లోనే ఖర్చులు పెరుగుతున్నాయి. సాగునీటి కష్టాలు ఏర్పడ్డా గత ఏడాది మిర్చి ధరలు అధికంగా ఉండటంతో ఈ ఏడాది మండలంలో 5 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. మిర్చి మొక్కలు ప్రస్తుతం మొక్క దశలోనే ఉన్నాయి. ఈ దశలో నీరు లేక బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులు పైపాట్లు చేసుకోవటంతో పాటు వారానికి ఒకసారి లీటరు నీటికి 10 నుంచి 15 గ్రాములు యూరియా పిచికారి చేసినట్లయితే మొక్కలను రక్షించుకోవచ్చని గరికపాడుృకషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.