తెల్లబోయి చూస్తున్నారు..!
కంకిపాడు (కృష్ణా జిల్లా) : నలభై యాభై అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న ఈ నీటి ధారను పరిశీలనగా చూడండి. ఏ మోటారో ఆన్ చేస్తే ఎగసిపడుతున్నవి కాదు. సహజంగానే ఎగజిమ్ముకొస్తోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారులో గిరిరెడ్డి అనే రైతు పొలంలో ఈ దృశ్యం శనివారం ఆవిష్కృతమైంది. గిరిరెడ్డి తన పొలంలో ఉన్న బోరుబావిలో లోతు పెంచేందుకు డ్రిల్ చేయించాడు. అది శుక్రవారం ముగిసింది.
40 అడుగుల లోతును 150 అడుగులకు వరకు పెంచాడు. శనివారం మోటార్ ఆన్ చేయగా ఏమైందో ఏమో గానీ... నీటి ఒత్తిడికి సబ్‌మెర్సిబుల్ మోటార్ కూడా పైకి తన్నుకొచ్చింది. అలా అని నీటి ప్రవాహం ఆగిపోలేదు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలైన ఆ జలధార 3 గంటలైనా ఆగకుండా పైగి ఎగదన్నుతూనే ఉంది. దీంతో అక్కడున్నవారు తెల్లబోయి చూస్తున్నారు.