ఐటీ కన్ను
అధిక డిపాజిట్లపై ఆరా
వివరాలు అందించాలని
బ్యాంకులు, తపాలశాఖకు ఆదేశాలు
ఏలూరు (మెట్రో) :
నల్ల కుబేరుల భరతం పట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి డిసెంబర్ 31 వరకూ బ్యాంకుల్లో జమ అయిన డిపాజిట్లపై ఆరా తీస్తోంది. ఈ వివరాలను ఈ నెలాఖరులోగా తమకు అందించాలని బ్యాంకర్లను ఐటీ అధికారులు కోరారు. ఈనెల 31లోగా వివరాలు అందించకుంటే తామే బ్యాంకుల్లో తనిఖీలు చేపడతామని హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఈనేపథ్యంలో బ్యాంకర్లు అత్యవసర విధులు తప్ప ఇతర సాధారణ పనులన్నీ ఆపేసి గత రెండునెలల డిపాజిట్ల వివరాలను క్రోడీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా పంట, బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర పనులను బ్యాంకులు వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పక్కనే ఉన్న కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆదాయపుపన్ను చెల్లించకుండా నగదు డిపాజిట్ చేసిన వారి వివరాలను సేకరించి వారికి నోటీసులు ఇచ్చేందుకు ఐటీ అధికారులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ రెండు జిల్లాలతో పాటుగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ పెద్దసంఖ్యలో భారీ డిపాజిట్లు జరిగినట్టు ఇప్పటికే ఐటీ శాఖ ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగా డెల్టా ప్రాంతంలో రూ.కోట్లు జమయ్యాయని ఐటీ శాఖ గుర్తించినట్టు సమాచారం. బ్యాంకులు వివరాలు ఇచ్చిన అనంతరం అనుమానం ఉన్న లాకర్లనూ ఆదాయపుపన్ను శాఖ పరిశీలించనున్నట్టు తెలుస్తోంది.
రాత్రికిరాత్రే భారీ డిపాజిట్లు!
పెద్దనోట్ల రద్దు తర్వాత పొదుపు ఖాతాల్లో రూ.2.50లక్షలలోపు, కరెంటు ఖాతాల్లో రు.12.50లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చని రిజర్వ్‌బ్యాంకు సూచించింది. అంతకుమించి డిపాజిట్లు నమోదైతే వాటికి సబంధించిన ఆధారాలు చూపాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే పెద్దనోట్ల ర్దు ప్రకటించిన నవంబరు 8వ తేదీ రాత్రే భారీ ఎత్తున నగదు డిపాజిట్ మిషన్ల ద్వారా జమైనట్లు తెలుస్తోంది. ఇలాంటి వివరాలను ఈఫైలింగ్ ద్వారా అందించాలని ఐటీ అధికారులు బ్యాంకులకు సూచించారు.
బ్యాంకర్లపైనా నిఘా
బ్యాంకర్లపైనా ఐటీ శాఖ నిఘాపెట్టినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నగదు మార్పిడికి పాల్పడిన అక్రమ అధికారులపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే తణుకు స్టేట్‌బ్యాంకులోనూ, మేనేజర్, సిబ్బంది నివాసాలపైనా ఐటీ శాఖ దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్‌పై జరిగిన దాడులూ దీనిలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఏలూరు వన్‌టౌన్‌లో బంగారు దుకాణాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఫిబ్రవరిలో ఐటీశాఖ దాడులు భారీగా ఉండొచ్చని తెలుస్తోంది