ఇది దుర్మార్గ పాలన | It is unjust governance | Sakshi
Sakshi News home page

ఇది దుర్మార్గ పాలన

Published Wed, Nov 11 2015 2:48 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

ఇది దుర్మార్గ పాలన - Sakshi

ఇది దుర్మార్గ పాలన

 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా మండిపాటు
♦17 నెలల పాలనలో 1,400 మంది రైతుల ఆత్మహత్య
♦ పత్తికి మద్దతు ధరపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాట
♦ ఇరు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు గాల్లో మేడలు కడుతున్నారు
♦ వైఎస్ పాలన రావాలంటే ఫ్యాన్‌కు ఓటేయండి
♦ వరంగల్‌లో పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా ప్రచారం
 
 పర్వతగిరి, రాయపర్తి, తొర్రూరు: కోటి ఆశల తెలంగాణ.. ప్రస్తుతం రైతుల ఆత్మహత్యతో విలవిల్లాడిపోతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ 17 నెలల పాలనలో 1,400 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా పర్వతగిరి, రాయపర్తి, తొర్రూరు, సంగెం తదితర మండలాల్లో రోడ్‌షో నిర్వహించారు. పత్తికి కనీస మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. వరుసగా తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు వ్యవసాయం దండగ అన్నారని మండిపడ్డారు. కానీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విత్తనాల ధర తగ్గించి, వ్యవసాయూనికి ఉచిత విద్యుత్ అందజేసి, రైతుల రుణాలను మాఫీ చేసి రైతు బాంధవుడయ్యూరని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటితో వైఎస్‌కు అనుబంధం ఉందని, ప్రతి ఇళ్లు వైఎస్సార్ పథకాలతో లబ్ధి పొందిందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలో ఇద్దరు చంద్రులు మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ గాలిలో మేడలు కడుతున్నారని మండిపడ్డారు.

 17 నెలల్లో ఏం చేశారు?
 బంగారు తెలంగాణగా చేస్తానని ఒకరు, సింగపూర్‌లా అభివృద్ధి చేస్తానని మరొకరు ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని కేసీఆర్, చంద్రబాబుపై రోజా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో ప్రజా సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పంటల్లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం వారి కుటుంబాలను పరామర్శించకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన సాగించడం దుర్మార్గమన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదని, రైతులకు రుణాలు మాఫీ చేయడం లేదని దుయ్యబట్టారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తుంగలో తొక్కడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.

ప్రధాని మోదీ ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు. రాష్ట్ర కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీకి ఓట్లెందుకు వేయాలో ప్రజలందరూ ఆలోచించాలని కోరారు. వైఎస్ పాలన రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రోడ్‌షోలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కందాడి అచ్చిరెడ్డి, కళ్యాణ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement