దాడుల పర్వం
బంగారం దుకాణాలపై ఐటీ దాడులు
ఆభరణాల తయారీదారుడి నుంచి కిలో బంగారం స్వాధీనం
తణుకు :
నల్లధనాన్ని బంగారం రూపంలోకి మార్పిడి చేసే కార్యక్రమం ఊపందుకోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడుల పర్వానికి తెరలేపారు. తణుకు పట్టణంలో శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఇప్పటికే కొందరు కిలోల కొద్దీ బంగారాన్ని రహస్య ప్రదేశాలకు తరలించగా.. వెలికితీసేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. తణుకు నుంచి వేల్పూరు వెళ్లే రోడ్డులోని బంగారు ఆభరణాల తయారీదారుడి దుకాణంపై దాడి చేశారు. అతని వద్ద బిస్కెట్లు రూపంలో ఉన్న సుమారు కిలో బంగారానికి లెక్కలు చూపించమని కోరినట్లు సమాచారం. దుకాణదారుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సదరు బంగారాన్ని సీజ్ చేసి తీసుకెళ్లారు. అయితే, స్వాధీనం చేసుకున్న బంగారం కిలో కంటే ఎక్కువే ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆటోలు వచ్చిన ఐటీ అధికారులు వేల్పూరు రోడ్డులో సాధారణ వ్యక్తుల్లా సమాచారం సేకరించారు. అనంతరం ఆభరణాల తయారీదారుపై దాడి చేశారు.