ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు
హిందూపురం అర్బన్ : ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజల చెవ్వుల్లో పూలు పెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయని విద్యార్థి యువ జేఏసీ గౌరవధ్యక్షుడు ఇందాద్, అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద చెవుల్లో పూలు పెట్టుకుని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంతో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదాపై ఏమాత్రం స్పందించకుండా నోరు మెదపకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో జెఏసీ నాయకులు జమీల్, బాబావలి, కదీరిష్, నాగభూషణ్, రవి, అభిషేక్, లోకేష్, సంపత్ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఆశలపై నీళ్లు చల్లారు
హిందూపురం టౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీళ్లు చల్లాయని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధు మండిపడ్డారు. శనివారం రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో బైఠాయించి రాస్తారోకో చేశారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో ఆందోళనకారులను అరెస్టు చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సంపత్‌కుమార్, ఆసీఫ్, సునీల్, బెన్నీ, సీపీఐ నాయకులు కృష్ణ, మధు, నౌషాద్, రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.