మన్యం మురిసింది | jagan agency tour | Sakshi
Sakshi News home page

మన్యం మురిసింది

Published Thu, Dec 8 2016 12:40 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

మన్యం మురిసింది - Sakshi

మన్యం మురిసింది

బిడ్డకు దూరమైన తల్లి ... అమ్మ ఒడి నుంచి మృత్యుఒడికి చేరిన పసికందులు... భర్త మృతితో ఒంటరైన ఇల్లాలు ... ఆదుకోవల్సిన చెట్టంత కొడుకులు మృత్యువు పాలవడంతో కన్నీరు మున్నీరవుతున్న పండుటాకులు ... ఇలా గిరిజనులు గజగజలాడుతున్న భయానక స్థితి. ఈ సమయంలో వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ పర్యటన వారికి భరోసాఇచ్చింది. నిజంగానే మన్యం మురిసింది.
 
అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు
అభిమాన పలకరింపులు
భావోద్వేగంతో పంచుకున్న బాధలు
చలించిపోయిన జగన్‌
సర్కారు నిర్లక్ష్యంపై ధ్వజమెత్తిన యువనేత
రెండేళ్లు ఓపికపడితే మనదే రాజ్యమంటూ భరోసా
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ/రాజమహేంద్రవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసాతో మన్యం మురిసింది. రెండు రోజుల పర్యటన కోసం జిల్లాకు వచ్చిన వైఎస్‌ జగన్‌కు జిల్లా పార్టీ నేతలు, అభిమానులు, గిరిజనం అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. మధురపూడి విమానాశ్రయం నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరిన జగన్‌ సుమారు ఎనిమిదిన్నర గంటలపాటు ఏకధాటిగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానికుల ఇబ్బందులపై స్పందించి, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రంపచోడవరంలో దేవీపట్నం మండలానికి చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, రాజవొమ్మంగి మండలంలో శిశు మరణాల బాధిత కుటుంబాలతో గంటకుపైగా గడిపారు. నిర్వాసితులు వెళ్ల బోసుకున్న గోడును సావధానంగా ఆలకించిన ఆయన సమస్యలకు పరిష్కారం చూపే వరకు పార్టీ తరఫున వెన్నంటి ఉంటానని అభయమిచ్చారు. మా నాన్న రాజన్న గిరిజనులకు ఎనిమిది లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించారన్నప్పుడు ఒక్కసారిగా గిరిజనులు కేరింతలతో వైఎస్‌పై ఉన్న అభిమానాన్ని గుర్తు తెచ్చుకున్నారు. పోలవరం నిర్వాసితులకు చట్టం ప్రకారం భూమికి భూమి, అందరికీ ఒకే విధంగా నష్టపరిహారం ఇవ్వని బాబు సర్కారుని నిలదీసిన జగన్‌ తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే చట్టం ప్రకారం గిరిజనులకు న్యాయం చేస్తామని గిరిజనులలో మనోధైర్యం నింపారు. మన్యంలో పౌష్టికాహారం, వైద్యం అందక  పురుటిలోనే బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులను చూసి తల్లడిల్లిపోయారు. ఒకే మండలం (రాజవొమ్మంగి)లో 13 మంది మృత్యువాత పడ్డా ప్రభుత్వం కనీస మానవత్వం చూపని విషయాన్ని ఆయన  ప్రస్తావించినప్పుడు తల్లిదండ్రులు జగన్‌ను పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన చిన్నారులు పొత్తిళ్లలోనే చనిపోతే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో ఆయన ప్రత్యక్షంగా చూడడంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో వారి ఆవేదనను చూసి చిలించిన జగన్‌కు కొద్దిసేపు నోట మాట రాలేదు. 
విద్యార్థుల పట్ల ఇలానా...
వీరిని ఓదార్చి మారేడుమిల్లికి వెళుతున్న జగన్‌ను తమ సమస్యలు వినాలని దాదాపు 700 మంది గిరిజన పాఠశాలల విద్యార్థులు దగ్గరుండి రంపచోడవరం గురుకుల పాఠశాలకు తీసుకెళ్లారు. పాఠశాలలో సౌకర్యాలు, హాస్టల్‌ల్లో మౌలిక వసతులు, భోజనం, సాంబారు, కూరలను స్వయంగా ఆయన గరెటతో తిప్పి రుచి కూడా చూశారు. సాంబారు రుచి చూసిన జగన్‌ ఇది సాంబారా? వేడినీళ్లా అంటూ విద్యార్థులకు ఇలాంటి ఆహారాన్ని పెడుతున్నారా అంటూ ఆశ్చ ర్యపోయారు. మరికొంచెం ముందుకు వెళ్లిన జగన్‌ పిల్లలు వినియోగించాల్సి మరుగుదొడ్లకు తలుపులు, నీరు లేకపోవడాన్ని పరిశీలించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు. ప్రస్తుతం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పిల్లలు కొండలపైకి వెళుతున్న పరిస్థితులను తెలుసుకుని తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటివి లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.
కాంట్రాక్టు లెక్చరర్లకు బాసటగా...
తొలుత మధురపూడి నుంచి బయలు దేరిన జగన్‌ నేరుగా బూరుగుపూడిలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని గత కొంతకాలంగా ’కడుపుకోత’ పేరుతో ఆందోళన నిర్వహిస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం జరిగేవరకు వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. రెండేళ్లు ఓపికపట్టండి, మన ప్రభుత్వం వచ్చిన రెండు, మూడు నెలల్లో అందరికీ ఉద్యోగాలు క్రమబద్థీకరిస్తామని చెప్పినప్పుడు వారిలో ఆనందం ఉప్పొంగింది.
అక్కడ నుంచి కోరుకొండ మండలం గుమ్ములూరు చెరువు గర్భంలో దాదాపు ఐదేళ్లుగా ఆవిష్కరణ కోసం ఎదురు చూస్తున్న ధ్యానముద్రలోని మహానేత వై.ఎస్‌. విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించినప్పుడు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంత ప్రజలు తరలివచ్చారు. జగన్‌ను చూసేందుకు చెరువు చుట్టూ చేరడంతో వారిని కట్టడిచేయడం ఎవరివల్లా కాలేదు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ బైక్‌ ర్యాలీతో జగన్‌ను గుమ్ములూరుకు తీసుకెళ్లారు. మహిళలు హారతులిచ్చి సాదరంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడ నుంచి ఏజెన్సీ ముఖద్వారం గోకవరం వద్ద జగ్గంపేట కో ఆర్టినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జగన్‌కు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్‌ ఆధ్వర్యంలో రంపచోడవరంలోని గోపవం వద్ద గిరిజనులు సంప్రదాయ కోయడోలు, కొమ్ము నృత్యంతో ఆహ్వానించి, కొమ్ములను జగన్‌ తలపై పట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వరకు అడుగడుగునా జనాన్ని పలకరిస్తూ రాత్రి 7:30 గంటలకు స్థానిక అటవీశాఖ అతిథి గృహానికి చేరుకుని బస చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement