వనసీమకు నవవసంతంలా
వనసీమకు నవవసంతంలా
Published Fri, Dec 9 2016 12:28 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
పొదల మాటున మాటేసి లంఘించి, కబళించే పెద్దపులుల్లా.. కారణం తెలీకుండానే ప్రాణాల్ని గాలిలో కలిపేస్తున్న వ్యాధులు; కనీస పోషకాహారం కూడా అందని దుస్థితి; ‘పోలవరం’ కోసం చేసిన త్యాగాలతో శాపగ్రస్తమైన బతుకులు.. ఇదీ జిల్లాలో విలీనమైన మండలాల్లో అడవిబిడ్డల దయనీయ జీవనచిత్రం. వారి ఆక్రందనతో కొండకోనలు మార్మోగుతున్నా.. అభివృద్ధి అంటే సింగపూర్ తరహా నగర నిర్మాణమేనని నమ్మించజూసే పాలకుల చెవికి వినిపించడం లేదు. అలాంటి తరుణంలో.. కీకారణ్యాన్ని చీల్చుకువచ్చిన ఆశల పొద్దుపొడుపులా వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పర్యటన.. గిరిజనుల మోముల్లో కొత్త వెలుగును నింపింది. సమస్యల కార్చిచ్చులో వేగుతున్న వారికి ఆయన తొలకరి వానలా కనిపించారు. ‘కలకాలం ఉండవులే కన్నీళ్లు.. కలతైనా, నలతైనా కొన్నాళ్లే’ అన్న కొండంత భరోసా కల్పించారు. జగన్ పర్యటన అరణ్యాన్ని జనారణ్యంగా మార్చింది. జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో.. వానాకాలపు కొండవాగులా.. ఉత్సాహం పరవళ్లు తొక్కేలా చేసింది.
మన్యసీమలో రెండురోజుల పర్యటనతో గిరిజనులకు భరోసానిచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత
అడవిబిడ్డల సమస్యలు క్షుణ్నంగా తెలుసుకున్న జగన్
కన్నీళ్లు తుడిచి, రేపటిపై కొత్త ఆశలు రేకెత్తించిన జననేత
దూరాభారాల్ని ఖాతరు చేయక రేఖపల్లి సభకు పోటెత్తిన జనం
జిల్లాలో పార్టీ శ్రేణుల్లో పరవళ్లు తొక్కిన ఉత్సాహం
సాక్షి, రాజమహేంద్రవరం : పచ్చని మన్యసీమలలో ఆనందం పరవళ్లు తొక్కింది. పోలవరం ప్రాజెక్టుతో నిరాశ్రయులవుతున్న విలీన మండలాల గిరిజనులు, అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడుతున్న అడవి బిడ్డల మోముల్లో తమకు భరోసాగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్న కొండంత నమ్మకం కనిపించింది. జిల్లా పర్యటనలో చివరిదైన రెండో రోజు గురువారం జగన్ ఏజెన్సీలోని గూడేలు, గ్రామాలను సందర్శించారు. రోడ్డు పొడవునా తన కోసం వేచి ఉన్న అడవి బిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు తెలుకుని, పరిష్కారానికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
గురువారం ఉదయం మారేడుమిల్లి అటవీశాఖ అతిథి గృహంలో తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, విద్యార్థులతో ఫొటోలు దిగిన జగన్ వారిలో ఆనందాన్ని నింపారు. జగన్‌తో కరచాలనం చేసి, ఫొటోలు దిగిన గిరిజన విద్యార్థులు కేరింతలు కొట్టారు. అక్కడ నుంచి చింతూరుకు చేరుకున్న జగన్‌కు లక్కవరం జంక్షన్ వద్ద గిరిజనులు భారీ సంఖ్యలో ఎదురేగి ఘనస్వాగతం పలికారు. చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ సమ్యలను జగన్‌కు చెప్పుకుని ఊరట పొందారు. దారి పొడవునా తనను చూసేందుకు వచ్చిన వారిని పలకరించేందుకు జగన్ వాహనం ఆపి మరీ వారి వద్దకు వెళ్లి పలకరించారు. చిన్నారులను ముద్దాడి జగన్ వారి పట్ల తన ఆపేక్షను చాటారు. కూనవరంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించినప్పడు ప్రజలు కరతాళధ్వనులు చేసి సంక్షేమ విధాతపై తమ గుండెళ్లో చెక్కుచెదరని అభిమానాన్ని చాటుకున్నారు.
శబరి బ్రిడ్జిపై జనఝరి
వీఆర్ పురం మండలం రేఖపల్లి బహిరంగ సభకు జగన్‌ను ఆహ్వానించేందుకు పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలు శబరి బ్రిడ్జి వద్దకు పోటెత్తారు. అరకిలోమీటర ు ఉన్న ఆ వంతెనపై ఇసుక వేస్తే రాలనంతగా జనం గూమిగూడారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, కొమ్ము కోయ నృత్యంతో గిరిజన మహిళలు, పురుషులు జననేతకు సాదర స్వాగతం పలికారు. పలువురు మహిళలు వైఎస్ చిత్రపటాన్ని చేతపట్టుకుని జగన్ కోసం ఎదురు చూశారు. మహిళలు జగన్‌కు హారతినిచ్చి తిలకం దిద్దారు. బహిరంగసభకైతే జనం వరద వేళ అఖండగోదావరిలా పోటెత్తారు. ఏజెన్సీ నలుమూలల నుంచి వెల్లువెత్తిన గిరిజనమే కాక.. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులతో సభాస్థలి ఇసుకవేస్తే రాలనట్టు కనిపించింది.
అక్కున చేర్చుకున్న పండుటాకులు
బ్రిడ్జి నుంచి అశేష జనవాహిని జగన్ వెంట నడుస్తూ రేఖపల్లి చేరుకున్నారు. దారిపొడవునా వృద్ధులు, పిల్లలను పలకరిస్తూ జగన్ ముందుకు కదిలారు. ‘మాకు నీవే అండ’ అంటూ వృద్ధులు జగన్‌ను ఆప్యాయంగా హత్తుకున్నారు. నిర్వాసితులతో జరిగిన ముఖాముఖిలో తమ సమస్యల పరిష్కారానికి జగన్ భరోసా ఇవ్వడంతో ముంపుబాధితుల మోముల్లో కొత్త ఆశలు చిగురించాయి. అనంతరం గ్రామ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేటప్పుడు జనం జేజేలు పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ప్రతి పలుకూ పంచదార పలుకులా..
బహిరంగ సభ నాలుగు గంటలు ఆలస్యమైనా కొండకోనల్లో నుంచి వచ్చిన గిరిజనం ఆద్యంతం జగన్ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించింది. కూనవరం, చింతూరు, ఎటపాక, వీఆర్‌పురం మండలాల నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గూడేల నుంచి గిరిబిడ్డలు తరలివచ్చారు. రవాణా సౌకర్యంలేని తమ గూడేలకు రాత్రయితే వెళ్లేందుకు వీలుపడదని, అడవిదారుల్లో చలి బాధిస్తుందని తెలిసినా సాయంత్రం 5.30 గంటలకు జగన్ వెళ్లే వరకు కదలని గిరిజనుల్లో ఆయన పట్ల అచంచల విశ్వాసం కనిపించింది. తమను పట్టి పీడించే సమస్యలన్నింటికీ ఆయన విరుగుడన్న గురి వారి మోముల్లో మెరుపులా వ్యాపించింది.
భారీ బందోబస్తు
జగన్ పర్యటన నేపథ్యంలో ఏజెన్సీలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మారేడుమిల్లి నుంచి కూనవరం వరకు సీఆర్ఫీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలు పహారా కాశాయి. స్థానిక పోలీసులు జగన్ కాన్వాయ్ వెంట పరుగులు తీస్తూ, కరచాలనం కోసం తోసుకు వస్తున్న ప్రజలను అదుపు చేస్తూ పర్యటన సాఫీగా సాగేలా కృషి చేశారు.
Advertisement