ఆనంద ప‌ర‌మానంద‌ | jagannadha ratha yatra rajamahendravaram | Sakshi
Sakshi News home page

ఆనంద ప‌ర‌మానంద‌

Published Fri, Mar 17 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

ఆనంద ప‌ర‌మానంద‌

ఆనంద ప‌ర‌మానంద‌

–వీధివీధులా విహరించిన విశ్వవిభుడు
–అంబరాన్నంటిన భక్తజనఘోష
–వైభవంగా జగన్నాథ రథయాత్ర
రాజమహేంద్రవరం కల్చరల్‌ : ‘జయ జగన్నాథ.. గోవిందా జయ జయ, గోపాల జయజయ, హరేకృష్ణ హరే కృష్ణ, కృష్ణకృష్ణ హరే హరే నామసంకీర్తనలతో రాజమహేంద్రవరం మార్మోగింది. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర కోటిపల్లి బస్టాండు సమీపంలోని ఆలయ నృత్యకళావనం వద్ద వైభవంగా ప్రారంభమైంది. జగదారాధ్యుడు, జగద్వంద్యుడు, జగదానందకారకుడు, జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు బలరామ, సుభద్రలతో రథంపై ఆశీనుడయ్యాడు. భక్తజన మానసాలను అమందానందకందళిత హృదయారవిందాలను చేస్తూ, రథం కదలింది. ముందుగా నిర్వాహకులు గుమ్మడికాయలు కొట్టి, హారతులు ఇచ్చి రథయాత్రను ప్రారంభించారు. రథం వెళ్లే మార్గాన్ని ప్రజాప్రతినిధులు లాంఛనంగా, సంప్రదాయాన్ని అనుసరించి కొద్దిమేర శుభ్రం చేశారు. రథమార్గమంతటా భక్తులు పూలవాన కురిపించారు. 70 దేశాల నుంచి తరలి వచ్చిన సుమారు 200మంది భక్తులు రథయాత్రలో పాల్గొని నృత్యాలు చేస్తూ ఆ నందగోపాలుడిని స్మరించారు. కేరళరాష్ట్రం నుంచి వచ్చిన సంప్రదాయ కళాకారులు, విచిత్రవేషధారణలలో సంప్రదాయ కళాకారులు పాల్గొన్నారు. జోడుగుర్రాల ప్రత్యేక వాహనంపై ఇస్కాన్‌ స్థాపనాచార్యులు భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. కోటిపల్లి బస్టాండు, మెయిన్‌ రోడ్డు, కోటగుమ్మం, జండాపంజారోడ్డు, దేవీచౌక్‌లమీదుగా రథం ఆనం కళాకేంద్రం చేరుకుంది. ఇస్కాన్‌ నగరశాఖ అధ్యక్షుడు సత్యగోపీనాథ్‌ దాస్‌, భక్తినిత్యానంద స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడారు. రూరల్‌ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైయస్సార్‌ సి.పి సిటీ కన్వీనర్‌ రౌతు సూర్యప్రకాశరావు, గ్రేటర్‌ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వీరరాఘవమ్మ దంపతులు, నగర మేయర్‌ పంతం రజనీశేషసాయి, చల్లా శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement