jagannadha
-
జగన్నాథునికి నిద్రాహారాలు కరువు
భువనేశ్వర్ : విశ్వవిఖ్యాత జగన్నాథునికి కూడా కష్టాలు తప్పడం లేదు. ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాల్లో న్యాయ, అధికారిక సంస్కరణలు జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరంలో తీవ్ర అలజడిని రేకెత్తించాయి. శ్రీ మందిరం రత్న వేదికపై జగన్నాథునితో కొలువు దీరిన బలభద్రుడు, దేవీ సుభద్ర, సుదర్శనుడు గత రెండురోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉపవాసంతో జాగారం చేయాల్సి వచ్చింది. వరుసగా సోమ, మంగళవారాల్లో ఇదే పరిస్థితి తారసపడింది. జగతి నాథునికి కష్టాలు తెచ్చిపెడుతున్న శ్రీ మందిరం దేవస్థానం సేవాయత్లు, అధికార వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ తీరు పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. భగవంతుడు ఒక వైపు ఉపవాసం, జాగారాలతో నిరీక్షిస్తుండగా శ్రీ మందిరం ఆలయ వైకుంఠం (కొయిలి వైకుంఠొ) ప్రాంగణంలో అమూల్యమైన జగన్నాథుని అన్న ప్రసాదాల్ని పాతిబెట్టారు. దీంతో ఈ ప్రసాదాల కోసం పరితపించే భక్త జనానికి తీవ్ర మనస్తాపం ఎదురైంది. జగమోహన మండపం వివాదమే కారణమా! దాదాపు 2 ఏళ్లుగా మూతబడిన శ్రీ మందిరం ప్రాంగణంలోని జగ మోహన మండపాన్ని ఈ నెల 16వ తేదీన పునఃప్రారంభించారు. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కార్యాచరణ చేపట్టారు. దైనందిన సేవలకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని గర్భగుడిలోకి అనుమతించ రాదని హై కోర్టు ఆంక్షలు విధించింది. తరతరాలుగా కొనసాగుతున్న ఆచారానికి ఈ ఉత్తర్వులు కళంకమంటూ సేవాయత్ వర్గం ఆక్షేపించింది. గర్భగుడిలోకి ప్రవేశించడంపట్ల ఆంక్షలు నివారించాలని పట్టుబట్టింది. ఈ మేరకు హైకోర్టు నుంచి సానుకూల స్పందన కొరవడింది. దీంతో సేవాయత్ వర్గం ఎదురు దాడికి పరోక్షంగా సిద్ధమైంది. గర్భగుడి రత్నవేదికపై సేవల్ని నిర్వహించాల్సిన సింఘారి సేవాయత్ వర్గీయులకు అనివార్య కారణాలతో గర్భగుడిలోకి అడుగిడే అవకాశం లేదు. ప్రత్యామ్నాయంగా సేవల్ని నిర్వహించేందుకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని రాష్ట్ర హై కోర్టు నివారించినందున అనుబంధ సేవల్ని నిర్వహించేందుకు ఇతర వర్గాల సేవాయత్లు కూడా నిరాకరించారు. ఇలా సోమవారం శ్రీ మందిరంలో జగమోహన మండపం పునఃప్రారంభాన్ని పురస్కరించుకుని వివాదం తలెత్తడంతో నిత్యసేవలకు గండి పడింది. ప్రభావితమైన నిత్యసేవలు సోమవారం మంగళహారతి నుంచి ఇతర సేవలన్నీ ప్రభావితమయ్యాయి. ప్రాతఃకాల ధూపాదుల కార్యక్రమాన్ని సోమ వారం మధ్యాహ్నం ఆలస్యంగా నిర్వహించారు. ఈ క్రమంలో అపరాహ్న సేవలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. నిత్య కార్యకలాపాల్లో భాగంగా స్వామి వారి నివేదన కోసం వండిన అన్న ప్రసాదాలు పోటు ప్రాంగణంలోనే మగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో గర్భగుడి రత్నవేదికపై జగన్నాథునికి భోజనం లేకుండా పోయింది. నిత్య సేవల్లో క్రమం తప్పడంతో సోమవారం రాత్రి స్వామి వారికి ఏకాంత సేవ కూడా జరగలేదు. దీంతో స్వామి సోమవారం రాత్రి జాగారం చేయాల్సి వచ్చింది. భక్తులకూ దక్కని స్వామి ప్రసాదం మొత్తంమీద స్వామి వారికి అన్న ప్రసాదాల నివేదన జరగనందున నివేదనకు నోచుకోని అన్న ప్రసాదాల్ని శ్రీ మందిరం సముదాయంలో ఉన్న కోవెల వైకుంఠం (మూల విరాట్ల స్మశాన వాటిక)లో మట్టిలో పాతి బెట్టి చేతులు దులిపేసుకున్నారు. నిత్యం 56 రకాల వంటకాలతో అన్న ప్రసాదాల్ని సేవించాల్సిన స్వామికి వరుసగా రెండు రోజులపాటు వీటి నివేదన జరగకపోవడంతో జాతీయ, అంతర్జాతీయ జగన్నాథుని భక్తులు తీవ్ర మనస్తాపం చెందారు. స్వామి ఉపవాసం పాలు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే అశేష సంఖ్య భక్తులు, యాత్రికులకు జగన్నాథుని మహా ప్రసాదం లభ్యం కాలేదు. -
శ్రీ మందిరంతో సెల్ఫీ ముచ్చట
సాక్షి, భువనేశ్వర్/పూరీ: శ్రీ జగన్నాథుని దేవస్థానం సెల్ఫీ ముచ్చట ముప్పుగా మారింది. శ్రీ మందిరం దేవస్థానం ప్రాంగణంలో మొబైల్ కెమెరా, వీడియో రికార్డింగ్ నిషేధం. ఈ చర్యలకు పాల్పడిన యాత్రికుల వర్గం మొబైల్ వీడియో చిత్రీకరణ ఫేస్బుక్లో ప్రసారం చేసి చిక్కుల్లో పడ్డారు. ఇద్దరు వ్యక్తుల్ని నిందితులుగా గుర్తించిన సింహద్వార్ ఠాణా పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. పూణే నుంచి విచ్చేసిన ఆకాష్ మడకా, రాయ్పూర్ నుంచి వచ్చిన జుగొలొ కిషోర్ వైష్ణవ్లపై కేసుల్ని నమోదు చేసినట్లు సింహద్వార్ పోలీసులు పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ ఆలయం పరి పాలన విభాగం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులకు వ్యతిరేకంగా కేసుల్ని నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. శ్రీ జగన్నాథ ఆలయ చట్టం, సాంకేతిక సమాచార చట్టం-2000 కింద నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. శ్రీ మందిరం దేవస్థానం ప్రధాన ప్రాంగణంలో కొయిలి వైకుంఠొ (కోవెల శ్మశాన వాటిక), భోగమండపం, రత్న భాండాగారం, లోపలి ప్రాంగణం వగైరా ప్రముఖ చిత్రాల్ని వీడియో రికార్డ్ చేసి నిందితులు ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ఆనంద పరమానంద
–వీధివీధులా విహరించిన విశ్వవిభుడు –అంబరాన్నంటిన భక్తజనఘోష –వైభవంగా జగన్నాథ రథయాత్ర రాజమహేంద్రవరం కల్చరల్ : ‘జయ జగన్నాథ.. గోవిందా జయ జయ, గోపాల జయజయ, హరేకృష్ణ హరే కృష్ణ, కృష్ణకృష్ణ హరే హరే నామసంకీర్తనలతో రాజమహేంద్రవరం మార్మోగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర కోటిపల్లి బస్టాండు సమీపంలోని ఆలయ నృత్యకళావనం వద్ద వైభవంగా ప్రారంభమైంది. జగదారాధ్యుడు, జగద్వంద్యుడు, జగదానందకారకుడు, జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు బలరామ, సుభద్రలతో రథంపై ఆశీనుడయ్యాడు. భక్తజన మానసాలను అమందానందకందళిత హృదయారవిందాలను చేస్తూ, రథం కదలింది. ముందుగా నిర్వాహకులు గుమ్మడికాయలు కొట్టి, హారతులు ఇచ్చి రథయాత్రను ప్రారంభించారు. రథం వెళ్లే మార్గాన్ని ప్రజాప్రతినిధులు లాంఛనంగా, సంప్రదాయాన్ని అనుసరించి కొద్దిమేర శుభ్రం చేశారు. రథమార్గమంతటా భక్తులు పూలవాన కురిపించారు. 70 దేశాల నుంచి తరలి వచ్చిన సుమారు 200మంది భక్తులు రథయాత్రలో పాల్గొని నృత్యాలు చేస్తూ ఆ నందగోపాలుడిని స్మరించారు. కేరళరాష్ట్రం నుంచి వచ్చిన సంప్రదాయ కళాకారులు, విచిత్రవేషధారణలలో సంప్రదాయ కళాకారులు పాల్గొన్నారు. జోడుగుర్రాల ప్రత్యేక వాహనంపై ఇస్కాన్ స్థాపనాచార్యులు భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. కోటిపల్లి బస్టాండు, మెయిన్ రోడ్డు, కోటగుమ్మం, జండాపంజారోడ్డు, దేవీచౌక్లమీదుగా రథం ఆనం కళాకేంద్రం చేరుకుంది. ఇస్కాన్ నగరశాఖ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్, భక్తినిత్యానంద స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడారు. రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైయస్సార్ సి.పి సిటీ కన్వీనర్ రౌతు సూర్యప్రకాశరావు, గ్రేటర్ అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వీరరాఘవమ్మ దంపతులు, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, చల్లా శంకరరావు తదితరులు పాల్గొన్నారు.