సాక్షి, భువనేశ్వర్/పూరీ: శ్రీ జగన్నాథుని దేవస్థానం సెల్ఫీ ముచ్చట ముప్పుగా మారింది. శ్రీ మందిరం దేవస్థానం ప్రాంగణంలో మొబైల్ కెమెరా, వీడియో రికార్డింగ్ నిషేధం. ఈ చర్యలకు పాల్పడిన యాత్రికుల వర్గం మొబైల్ వీడియో చిత్రీకరణ ఫేస్‌బుక్‌లో ప్రసారం చేసి చిక్కుల్లో పడ్డారు. ఇద్దరు వ్యక్తుల్ని నిందితులుగా గుర్తించిన సింహద్వార్ ఠాణా పోలీసులు శుక్రవారం కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. పూణే నుంచి విచ్చేసిన ఆకాష్ మడకా, రాయ్‌పూర్ నుంచి వచ్చిన జుగొలొ కిషోర్ వైష్ణవ్‌లపై కేసుల్ని నమోదు చేసినట్లు సింహద్వార్ పోలీసులు పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ ఆలయం పరి పాలన విభాగం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులకు వ్యతిరేకంగా కేసుల్ని నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. శ్రీ జగన్నాథ ఆలయ చట్టం, సాంకేతిక సమాచార చట్టం-2000 కింద నిందితులపై చట‍్టపరమైన చర‍్యలు తీసుకుంటారు. శ్రీ మందిరం దేవస్థానం ప్రధాన ప్రాంగణంలో కొయిలి వైకుంఠొ (కోవెల శ్మశాన వాటిక), భోగమండపం, రత్న భాండాగారం, లోపలి ప్రాంగణం వగైరా ప్రముఖ చిత్రాల్ని వీడియో రికార్డ్ చేసి నిందితులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment