ప్రాణం తీసిన బెల్లం అక్రమ రవాణ
Published Mon, Sep 19 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
కురవి : బెల్లం అక్రమ రవాణా ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన మండలంలోని నేరడ శివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నేరడ శివారు కాకులబోడు తండాకు చెందిన బానోత్ లాల్‌సింగ్(22), గుగులోత్ రెడ్డి, గుగులోత్ నరేష్ రెండు ద్విచక్రవాహనాలపై బెల్లం బస్తాలు తెచ్చేం దుకు మహబూబాబాద్ మండలంలోని చోక్లాతండాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా రాయినిపట్నం క్రాస్ రోడ్ వద్ద ఓ వాహనం వెళ్తుండడాన్ని చూసి పోలీ సులుగా భావించి తమ ద్విచక్ర వాహనాలను రోడ్డు పక్కన ఆపారు. బెల్లం బస్తాలు పక్కన పడేసి సమీపంలోని మిరపతోటలోకి వెళ్లారు.
కాగా, తోటలో ఉన్న మరో వ్యక్తి వీరిని చూసి ‘దొంగలు..దొంగలు..’ అని అరిచాడు. దీంతో ఆ ముగ్గురూ పరుగుతీశారు. ఈ క్రమంలో బానోత్ లాల్‌సింగ్ వ్యవసాయ బావిలో పడిపోయాడు. రెడ్డి, నరేష్ రోడ్డుపైకి వచ్చి తమ బైక్‌పై కాకులబోడు తండాకు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాక లాల్‌సింగ్ బావిలో పడ్డాడని, అందులో వెతకాలని బంధువులకు ఫోన్ చేశారు.
తండాలోని కొందరు వ్యక్తులు బావి వద్దకు వెళ్లి టార్చ్‌లైట్లతో వెతికినా కనిపించలేదు. ఈలోగా మిరప తోటలోని వ్యక్తి సమాచారం అందించడంతో రాత్రి 12 గంటలకు పోలీసులు వచ్చి బెల్లం బస్తాలను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బావిలో వెతికి లాల్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
Advertisement
Advertisement