తాగి తోలితే జైలుకే..
తాగి తోలితే జైలుకే..
Published Fri, Jun 16 2017 11:39 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
– ఐపీసీ సెక్షన్లతో కేసు నమోదు
– పట్టుబడిన వాహనాలు కోర్టులో అప్పగింత
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. డీజీపీ నండూరి రామ్మోహన్‌రావు ఆదేశాల మేరకు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ విస్తృతం చేసేందుకు కార్యచరణ సిద్దం చేశారు. ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర నేతృత్వంలో కర్నూలులో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందు బాబులు పట్టుబడితే మోటారు వాహనాల యాక్ట్ అమలు చేసేవారు. వాహనాలు కూడా ట్రాఫిక్ స్టేషన్‌లో ఉంచుకొని కోర్టులో అపరాధ రుసుం చెల్లించిన వెంటనే ఎవరి వాహనాలు వారికి అప్పగించే వారు. అయితే కొత్తగా ఐపీసీ సెక్షన్లు కూడా మద్యం బాబులపై అమలు చేయనున్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మద్యం బాబులకు సినిమా చూపించే కార్యచరణను సిద్ధం చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే ఇకపై వాహనాలను నేరులో కోర్టులో హాజరు పరుచనున్నారు. మద్యం సేవించిన వ్యక్తిపై చార్జీషీటు నమోదు చేస్తారు. వాయిదాలకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో పట్టుబడిన మద్యం బాబుల నుంచి రూ.2వేలు అపరాద రుసుం కింద వసూలు చేసేవారు. అయితే కొత్తగా అమలు చేయనున్న ఐపీసీ సెక్షన్లతో జైలు శిక్షతో పాటు రూ.5 వేల వరకు అపరాధ రుసుం విధించే అవకాశం ఉంది. ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు నగరంలోని ముఖ్య కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించారు. ఆర్‌ఎస్‌ఐలు జయప్రకాష్, ప్రతాప్, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెంకటేశ్వరరావు, పరహత్‌ఖాన్ నేతృత్వంలో ఒక బృందం, ఆయా స్టేషన్ల పరిధిలోని ఎస్‌ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా కార్యచరణ రూపొందించారు. నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, డోన్ వంటి ముఖ్య పట్టణాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు కార్యచరణ సిద్దమైంది.
Advertisement