వరంగల్: వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో జైనుల శాసనాలను జనగామ డివిజన్ చరిత్ర పరిశోధకులు రత్నాకర్‌రెడ్డి సోమవారం వెలుగులోకి తెచ్చారు. ఆయన తెలిపిన వివరాలివీ..గ్రామంలో కాకతీయుల కాలంలో గణపతి దేవుడి సోదరి కుందమాంబ నిర్మించిన త్రికూటాలయం అలనాటి అపురూప శిల్పకళకు ప్రతీకగా నిలుస్తోంది. కాకతీయుల కంటే ముందు జైనం ఈ ప్రాంతంలో వర్ధిల్లినట్లు స్థానిక శివాలయ మంటపంలోని శాసనాలు చెబుతున్నాయి.
స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలోని గుట్టపై 8 మంది స్త్రీలతో పాటు పురుషుడు, ఓ చిన్నారి ఉన్న శిల్పతోరణాన్ని గుర్తించారు. ఇరవై అడుగుల పొడవున్న ఈ శిల్ప తోరణంపై కన్నడ లిపి ఉంది. దీనిని స్థానికులు సంకెల మైసమ్మగా కొలుస్తున్నారు. గుట్టకు ఆనుకుని ఉన్న చెరువు దిశగా గుర్రం గుండు సమీపంలో భైరవుని గుడి ఉంది. గుడిచుట్టూ మూడు భైరవ విగ్రహాలు, 10 వీరుల విగ్రహాలు ఉన్నాయి. అందులో ఏడడుగుల ఎతైన వీరుని విగ్రహం శిల్పకళతో ఉట్టిపడుతోంది. అంతేకాకుండా గుట్టపై గుహలో రాతిని తొలచి మలిచిన చిత్రాలు ఉన్నాయని రత్నాకర్‌రెడ్డి వెల్లడించారు.
వరంగల్ జిల్లాలో జైన మత ఆనవాళ్లు
Published Mon, Sep 7 2015 8:36 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM
Advertisement