జక్కంపూడి విజయలక్ష్మిని అడ్డుకున్న పోలీసులు
నిర్వాసితులకు పునరావాసం ఏదీ...?
- వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
సీతానగరం (రాజానగరం): పురుషోత్తపట్న ఎత్తిపోతల పథకం పనుల పరిశీలినకు సీఎం వస్తున్నారని ఖాళీ చేయించిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఎక్కడని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. మంగళవారం పురుషోత్తపట్నంకు వెళ్లడానికి వచ్చిన జక్కంపూడి విజయలక్ష్మిని రఘుదేవపురం రవీంద్ర కాలనీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక ఎస్సై ఎ. వెంకటేశ్వరావు జక్కంపూడిని అడ్డుకుని, సీఎం కార్యక్రమం ఉన్నందున వెళ్లరాదని అవరోధం సృష్టించినా ‘ససేమిరా’ అనండంతో కోరుకొండ సీఐ మధుసూదనరావుతోపాటుగా సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది తరలివచ్చి విజయలక్ష్మితో చర్చించారు. ఏటిగట్టుపై ఉంటున్న వారికి ఖాళీ చేయించారని, వారు గత ఏభై ఏళ్లుగా ఉంటున్నారని, తొలగించి వారికి స్థలాలు కేటాయింస్తామని తహసీల్దార్ తెలిపారని, వారికి తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ స్పందించి స్థలాల విషయం తాను తెలుసుకుంటానని, సీఎం కార్యక్రమం ఉన్నందున అటువైపు వెళ్లరాదని నచ్చజెప్పారు. దీంతో జక్కంపూడిì విజయలక్ష్మి వెనుతిరిగారు. జక్కంపూడి విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ పుష్కర పథకం ప్రారంభోత్సవానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా వచ్చినా ఎవరినీ నిర్వాసితులుగా చేయలేదన్నారు.
ప్రజలను మోసం చేయడానికే...
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో ప్రజలను మోసం చేస్తున్నారని విజయలక్ష్మి ఆరోపించారు. పనులు కాకుండానే పథకం ప్రారంభోత్సవాలేమిటని ప్రశ్నించారు. రైతులకు ఇళ్ల నుంచి కదలకుండా పోలీసులను ఏర్పాటు చేస్తున్నారని, రైతుల గొంతును నొక్కిపట్టి పథకాలను ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రావు, మద్దాల అను తదితరులు పాల్గొన్నారు.