పెట్టుబడి నిధులిస్తామని పత్రాలిస్తారా?
ఎమ్మెల్యేపై ఎస్సీపేట మహిళల ఆగ్రహం
జనచైతన్య యాత్ర నుంచి వెనుదిరిగిన వైనం
గిడజాం (రౌతులపూడి) : డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధికింద మంజూరైన సొమ్ములను ఇస్తామని చెప్పి పత్రాలు ఇవ్వడమేమిటని పలువురు మహిళలు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును నిలదీశారు. జన చైతన్య యాత్రలో బాగంగా మండలంలోని గిడజాం, కోడూరు, పారుపాక, డి.జే.పురం, ఎస్.అగ్రహారం గ్రామాల్లో మంగళవారం టీడీపీ శ్రేణులతో కలసి ఆయన పర్యటించారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించాల్సిన ఈ యాత్ర మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కావడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ముందుగా గిడజాం పంచాయతీ కార్యాలయం వద్ద పెట్టుబడినిధికి సంభందించిన సొమ్ములుకోసం వచ్చిన మేడపాటి వెంకయమ్మ పెట్టుబడినిధి సొమ్ములు ఇస్తారంటే వచ్చాం. పత్రాలు చేతిలో పెట్టారేంటని ఆమె ఎమ్మెల్యేను నిలదీసింది. అలాగే గ్రామంలోని ఎస్సీ పేటలోని మహిళలను పెట్టుబడనిధిసొమ్ములు ఇస్తారని మభ్యపెట్టి ఇక్కడకు రప్పించారని ఉదయంనుంచి వేచివున్నా ఫలితం లేకపోవడంతో ఏదైనా ఇచ్చేదివుంటే ఎస్సీపేటలో ఇవ్వాలికాని ఇక్కడకు రమ్మనటమేమిటిని టీడీపీ శ్రేణులపై మండిపడి వెనక్కు వెళ్లిపోయారు. చేసేదిలేక ఎమ్మెల్యే వరుపుల, మిగిలిన టీడీపీ శ్రేణులంతా ఎస్సీపేటకు వెళ్లి పెట్టుబడినిధి సొమ్ములు బ్యాంకులో జమచేస్తారని కేవలం ఈ పత్రాలు మంజూరు పత్రాలు మాత్రమేనని మహిళలకు వివరించారు. అలాగే పారుపాక పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఉపాధి హామీ పథకంలో ఆరేళ్లుగా మామిడి, జీడిమామిడి మొక్కలు వేసుకొని సాగుచేసుకుంటే నేటికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని, ఎన్నిసార్లు అ«ధికారులను అడిగినా కనీసం పట్టించుకోలేదని గ్రామానికి చెందిన ఉర్లంకల బాబూరావు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.దీంతో సంభందిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్టుబడినిధి పత్రాలను పలువురు మహిళలకు అందించారు. అనంతరం డి.జే.పురం, ఎస్.అగ్రహారాల్లోని పార్టీ ముఖ్యనాయకులను కలసి జనచైతన్య యాత్రలను పూర్తిచేసారు. ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మిశివకుమారి, టీడీపీ సమన్వయ కర్త పర్వత రాజుబాబు, పార్టీనాయకులు పాల్గొన్నారు.