కల్తీపాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి
ఇబ్రహీంపట్నంరూరల్: కల్తీ పాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. జంగారెడ్డి అన్నారు. తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పాషానరహరి స్మారక కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిఘా వైఫల్యం వల్లే నకిలీ పాలు వస్తున్నాయన్నారు. యూరితోపాటు పాలు తయారు చేసి విక్రయించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాలపై ముఖ్యమంత్రి స్పందించడం అభినందనీయమన్నారు.
పాల బూత్, పాల శీతలీకరణ కేంద్రాలపై దాడులు చేయాలన్నారు. రైతు సంఘం బలోపేతం కోసం వచ్చే నెలలో జిల్లా, మండల మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ నెల 26న ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని.. ఈ సమావేశానికి ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.