కల్తీ పాలు తయారు చేస్తూ పట్టుబడ్డ నిందితులతో డీఎస్పీ కె.నాగేశ్వరరావు
నరసరావుపేట రూరల్ /రొంపిచర్ల : ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిన కల్తీ పాల తయారీదారులపై కఠిన చర్యలు చేపడతామని డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేట మండలం లింగంగుంట్లలో శ్రీనివాసరావు నిర్వహించే కల్తీపాల తయారీ కేంద్రం పై దాడులు నిర్వహించినట్టు వివరించారు. పాలపొడి, సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, మిక్సీలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ బి.ప్రభాకర్, టూటౌన్ సీఐ బి.ఆదినారాయణ, ఎస్‌ఐలు ఎ.వి. బ్రహ్మం, వెంకట్రావు పాల్గొన్నారు. రొంపిచర్ల మండలంలోని సుబ్బయ్యపాలెం గ్రామంలో గత ఆరు నెలలుగా కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతోంది.
దీనిపై సమాచారం అందడంతో దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఐ ఎస్.వెంకట్రావు గురువారం రాత్రి సిబ్బందితో కలసి వెళ్లి దాడి చేశారు. దీంతో కల్తీ పాల వ్యాపారం గుట్టు రట్టయింది. కల్తీ పాల తయారీకి ఉపయోగించే సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, పాల పొడిని 90 లీటర్ల కల్తీ పాలను, పాలు తరలించే ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటకు చెందిన శ్రీలక్ష్మి సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన తన బంధువైన గీత సహాయంతో కొంతకాలంగా కల్తీ పాల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. వేరే గ్రామంలో ఇంటింటికీ తిరిగి పాలు సేకరించి సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు, పాల పొడి, యూరియా కలిపి కల్తీ పాలు తయారు చేసి దూర ప్రాంతాలకు తరలిస్తారు. నిందితురాలు శ్రీలక్ష్మి అదుపులో ఉండగా, గీత పరారీలో ఉన్నట్టు చెప్పారు. గీతను పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment