సాక్షి, ఢిల్లీ: మాజీ బీజేపీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి కుమారుడికి ప్రధాని మోదీ ఫోన్ చేసి.. సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ప్రధాని మోదీ సంతాప ప్రకటన విడుదల చేశారు. ‘జనసంఘ్, బీజేపీ విజయ పథంలోకి తీసుకెళ్లడానికి మాజీ ఎంపీ జంగారెడ్డి విశేష కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. అనేకమంది బీజేపీ కార్యకర్తలకు ఆయన ప్రేరణ ఇచ్చార’ని ప్రధాని కొనియాడారు.
Shri C Janga Reddy Garu devoted his life to public service. He was an integral part of the efforts to take the Jana Sangh and BJP to new heights of success. He made a place in the hearts and minds of several people. He also motivated many Karyakartas. Saddened by his demise.— Narendra Modi (@narendramodi) February 5, 2022
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి.. హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
కరెంట్ జంగన్నగా పేరుపొందారు
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి పట్ల కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ వ్యవస్థాపకుల్లో జంగారెడ్డి ఒకరని ఆయన మరణం రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటని రైతు కుటుంబంలో జన్మించిన జంగారెడ్డి కష్టపడి పనిచేస్తూ పైకొచ్చిన నాయకుడని, జనం మధ్య పనిచేస్తూ ప్రజా ప్రతినిధిగా అనేక సార్లు గెలిచారని గుర్తుచేసుకున్నారు. పీవీ నర్సింహారావుపై ఎంపీగా విజయం సాధించిన నాయకుడు జంగారెడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా చేయించడంలో, మోటార్లు కరెంటు మోటార్లు బిగించడంలో విశేష కృషి చేస్తూ కరెంట్ జంగన్నగా పేరుపొందారని తెలిపారు.
జంగారెడ్డి కృషి చిరస్మరణీయం
బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యా సాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తనకు స్పూర్తి ప్రదాత చందుపట్ల జంగారెడ్డి.. పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడానికి, ప్రజలకు సేవ చేసేందుకు జంగారెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ఈరోజు బీజేపీ తెలంగాణలో ఈ స్థాయిలో ఉందంటే.. అందులో ఆయన పాత్ర ఉందని పేర్కొన్నారు.
జంగారెడ్డి.. నేటి తరానికి ఆదర్శనీయం..
బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ నేత లక్ష్మణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం చేయడానికి జంగారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. జంగారెడ్డి లాంటి వ్యక్తులు వేసిన పునాదులే ఈరోజు బీజేపీ మహావృక్షంగా ఎదగడానికి కారణమయ్యాయని తెలిపారు. జంగారెడ్డి.. నేటి తరానికి కూడా ఎంతో ఆదర్శనీయమని చెప్పారు. రాజకీయాల్లో ఉండేవాళ్లు మడమ తిప్పకుండా జనం కోసం నిరంతరం శ్రమించాలని జంగారెడ్డి చెప్పేవారని తెలిపారు.
విద్యార్థి సమస్యలపై పోరాడేవారు
బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. తాను కాలేజీ విద్యనభ్యసించే రోజుల్లోనే జంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ.. విద్యార్ధి సమస్యలపై పోరాడేవారని గుర్తుచేసుకున్నారు. తనను నిరంతరం రాజకీయాల్లో ప్రోత్సహించిన నాయకుడు జంగారెడ్డి అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment