వేదన వినరు.. ఆర్భాటం వదలరు
జన్మభూమి గ్రామ సభల తీరిది
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
జన్మభూమి గ్రామ సభల్లో ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలతో సతమతమవుతున్న వారి వేదనలు మిన్నంటుతున్నాయి. ప్రజల కోసమే పనిచేస్తున్నట్టు డాంబికాలు పలుకుతూ.. ఆర్భాటాలు చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యలను, ప్రజల విజ్ఞాపనలను పట్టించుకోవడం లేదు. వయసు మీరినా పింఛన్లు అందక కొందరు, వివిధ కారణాలతో పింఛన్లు తొలగించారని కొందరు ఆవేదన చెందుతున్నా వారికి న్యాయం జరగడం లేదు. ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రుణాల కోసం అందుతున్న వినతులు బుట్టదాఖలా అవుతున్నాయి.
విద్యార్థులతో సభలు
రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇవ్వకుండా కేవలం పేర్లు చదివి ముగిస్తుండటంతో సభలకు జనం హాజరు తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ సభలపై అవగాహన కోసం విద్యార్థులను పంపించాలని విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో నరసాపురం నియోజకవర్గంలో శనివారం నాటి సభలకు విద్యార్థుళణు తీసుకొచ్చారు. నరసాపురం 22వ వార్డులో ఇళ్ల స్థలాలకోసం మహిళలు అధికారులను ప్రశ్నించారు. నరసాపురం మండలం చామకూరి పాలెంలో సింగోడియన్ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంపై ఎంపీటీసీ బొక్కా రాధాకృష్ణ అధికారులను నిలదీశారు. గత జన్మభూమి సభలో సమస్య పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తణుకు మండలం మండపాకలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎదుట పలువురు నిరసన తెలిపారు. గ్రామంలో రజకచెరువు పాడైందని, రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని రజకులు నిరసన వ్యక్తం చేశారు. అత్తిలి మండలం కంచుమర్రులో నిర్వహించిన గ్రామ సభలో 70 ఏళ్ల వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. గతనెల పింఛను డబ్బులు రాలేదని అడిగేందుకు వచ్చిన పడిపోగా, అక్కడే ఉన్న వైద్యసిబ్బంది సపర్యలు చేశారు. కంచుమర్రులో తాగునీటి సమస్యపై అధికారులను నిలదీశారు. పశువులకు చెరువు, తాగునీటి చెరువు పక్కపక్కనే ఉండటంతో నీళ్లు కలుషితమవుతున్నాయని వాపోయారు. చెరువు తవ్వుతామని ఏడాది క్రితం హామీ ఇచ్చినా అమలు కావడంలేదని తమ నిరసన తెలిపారు. కొవ్వూరు మండలం కాపవరంలో తనకు పింఛను రావడం లేదని పసుపులేటి వెంకటలక్ష్మి అనే మహిళ జన్మభూమి సభలో విలపించింది. పెంటపాడు గ్రామ సభలో రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నల్లమిల్లి రాఘవరెడ్డిని వేదికపైకి పిలవకపోవడంతో ఆయన సభను బహిష్కరించారు. ఈనాం భూ సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన ఆయనకు జన్మభూమి అధికారుల నుండి సరైన గౌరవం దక్కక పోవడంతో వెనుదిరిగారు. ఉపసర్పంచ్ గోపిరెడ్డిని, మండల వ్యవసాయాధికారిని వేదికపైకి ఆహ్వానించలేదు. టి.నరసాపురం మండలం తిరుమలదేవిపేటలో గ్రామసభ రసాభాస అయ్యింది. టీడీపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య అభివృద్ధి విషయంలో వాదులాటల నడుమ ప్రారంభమైన ఘర్షణ ఒక దశలో తోపులాటకు దారితీసింది. కాళ్ల మండలం జువ్వలపాలెంలో నివాస ప్రాంతాల వద్ద చేపల చెరువుల తవ్వకాన్ని నిలిపివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానికులు నినాదాలు చేశారు.