సర్పంచ్ అధికారాలకు తప్పని కత్తెర
జన్మభూమి కమిటీలకు మరింత పెత్తనం
ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు పోటీగా ఉంచే యోచన
జేబీ కమిటీల ముందు డమ్మీలుగా మారిన అధికారులు
నేటినుంచి ప్రారంభం కానున్న జన్మభూమి గ్రామసభలు
పలమనేరు: జన్మభూమి కమిటీల పేరిట చంద్రన్న ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తులతో పాలన చేయడానికే మొగ్గు చూపుతోంది. ఇప్పటికే వీరి కారణంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ఈ కమిటీల ప్రోద్బలంతో అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ అధికారులు పూర్తిగా డమ్మీలుగా మారారు. గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లకు ఏమాత్రం అధికారాలు లేకుండా చేయడంపై పలమనేరు నియోజకవర్గంలోని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పథకానికి కమిటీలే కీలకం
ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమపథకాల అమలులో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా, రాష్ట్ర, ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సుల్లో సైతం అధికారులతో పాటు వీరు పాల్గొంటున్నారు. అధికారులు ప్రభుత్వ పథకాల సమాచారం తదితర వివరాలను వీరికి తప్పకుండా తెలియజేస్తున్నారు. వీరు సిఫారసు చేస్తే గానీ పనులు జరగని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్సిడీ రుణాలకు సంబంధించి అధికారులతో పాటు లబ్ధిదారుల ఎంపికలో వీరిని కూర్చొబెట్టారు.
ఇక రుణమాఫీకి సంబంధించి అర్హులైన వారి విచారణలు, తప్పులు సరిదిద్దుకునే అవకాశంలోనూ వీరిదే హవా. ఇలా ప్రతి అంశంలోనూ జేబీ కమిటీ సభ్యులే కీలకంగా మారారు. నేటినుంచి సాగే జన్మభూమి గ్రామసభల్లో వీరికి మరింత పెత్తనం కట్టబెట్టడం మరింత వివాదంగా మారింది. స్థానికసంస్థల అధికారాలను నిర్వీర్యం చేస్తూ సర్పంచ్‌ల అధికారాలకు కత్తెర వేయడంపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై నేటి నుంచి జరిగే గ్రామసభల్లో వివాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.