– జన్మభూమిలో అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు
- సమస్యలపై నిలదీస్తే భౌతికదాడులు
– వంతపాడుతున్న అధికారులు, పోలీసులు
–రెండోరోజూ నిరసనల హోరు
అనంతపురం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం అధికార పార్టీ శ్రేణుల ఆగడాలకు వేదికగా మారింది. ప్రజలు సమస్యలను ప్రస్తావిస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు భౌతికదాడులకు దిగుతున్నారు. అధికారులు, పోలీసుల ముందే రెచ్చిపోతున్నారు. దీంతో సమస్యలపై అర్జీలివ్వడానికి సైతం ప్రజలు జంకుతున్నారు.మంగళవారం జన్మభూమి రెండోరోజు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా నిరననలు, నిలదీతలు, అరెస్టుల మధ్య సాగింది. పెనుకొండ మండలం దుద్దేబండలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు.
పేదల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, దుద్దేబండ సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, ఇతర నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి సిద్ధపడ్డారు. ఇంతలో ప్రజలు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారు. సభలో ప్రసంగిస్తున్న ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి చేతిలోని మైకుని లాక్కుని బయటకు పంపించాలంటూ గొల్లపల్లికి చెందిన టీడీపీ నాయకుడు రాజు దురుసుగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గ్రామానికి సంబంధం లేదని వ్యక్తులను సమావేశం నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపి నాయకుడు రాజుతో పాటు ఎంపీపీ భర్త కేశవయ్య తదితరులు వాగ్వాదానికి దిగారు.
అంతే కాకుండా ఎస్‌ఐ లింగన్నపై ఒత్తిడి చేసి సర్పంచ్ శ్రీకాంతరెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన వీరనారాయణరెడ్డి అనే నాయకుణ్ని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌వద్ద వారిని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పరామర్శించారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఖండించారు. అలాగే ఉరవకొండలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సభలో అధికారులను వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు. నాల్గవ విడత జన్మభూమి నిర్వహిస్తున్నా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వరా అంటూ జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, పట్టణ కన్వీనర్ తిమ్మప్ప, జిల్లా కమిటీ సభ్యుడు నిరంజన్‌గౌడ్, ఎంపీటీసీ చందా చంద్రమ్మ ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలేక పోలీసులను ఉసిగొలిపి బలవంతంగా అరెస్టు చేయించారు.
జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ జన్మభూమి సభల్లో నిరసనలు, నిలదీతలు వెల్లువెత్తాయి. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, రెయిన్‌గన్ల పంపిణీలో వివక్షతపై శెట్టూరులో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని టీడీపీ కార్యకర్తలు, సర్పంచు, ప్రజలు నిలదీశారు. అర్హులకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ కణేకల్లు మండలం జక్కలవడికి జన్మభూమి సభలో అధికారులను స్థానికులు ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, మరుగుదొడ్లు మంజూరు చేయాలని డి.హీరేహాళ్ మండలం మల్లికేతి గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. పలుమార్లు అర్జీలిచ్చినా రుణమాఫీ కాలేదని బొమ్మనహాళ్ మండలం సిద్దారాంపురం గ్రామంలో అధికారులను రైతులు నిలదీశారు. శింగనమల మండలం పెరవలి గ్రామంలో రేషన్ కార్డులు తొలగించారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంబదూరు మండలం రాళ్లఅనంతపురంలో ఇంటి బిల్లులు, పింఛన్లు ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు నిలదీయడంతో గందరగోళం ఏర్పడింది.
దాడులు..దౌర్జన్యాలు
Published Wed, Jan 4 2017 12:15 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement