లోకేష్ వద్ద మార్కుల కోసం మెహర్బానీ..
విజయవాడ : లోకేష్‌ను మంత్రి చేయాలన్నది చంద్రబాబు నాయుడు ఇష్టమని, ఆయన కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తామంటూ కొందరు మెహర్బానీ మాటలు చెప్పడం లోకేష్ వద్ద మార్కుల కోసమేనని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సీఎంను కలిసిన అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ లోకేష్ సమర్థుడని ఆయన ఆరు నెలల తరువాత ఎక్కడ నుంచైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి కావచ్చని చెప్పారు. తెలంగాణాలో మంత్రిగా కేటీఆర్ తన సమర్థతను నిరూపించుకున్నారని, ఏపీలో లోకేష్‌కు మంత్రికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.
లోకేష్ కేంద్రానికి వెళితే ఉపయోగం లేదని అన్నారు. సీఎం కొడుకైనంత మాత్రాన లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదని అన్నారు. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో యువత అవసరం ఉందని చెప్పారు. లోకేష్ పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అయితే మెహర్బానీ కోసం కొందరు లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వాలని భజన చేస్తున్నారని, దీని వల్ల పార్టీకి మేలు జరగదని జేసీ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణాల్లో నియోజకవర్గాల పెంపుపై పార్లమెంటులో చట్ట సవరణకు అవకాశం ఉందని చెప్పారు. జగన్ తన తండ్రి పేరు చెప్పుకుని బతుకుతున్నారని, తాను సొంతంగా ఏం చేస్తారో ప్రజలకు చెప్పడంలేదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.
టీడీపీ లోకేష్ తాతది : వైవీబీ
తెలుగుదేశం పార్టీ లోకేష్ తాతదని, గ్లామర్, ఇమేజ్ ఉన్న ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా లక్ష ఓట్ల మేజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కార్యాలయం వద్ద మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కఠోర శ్రమతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితిలో లోకేష్‌బాబు కృష్ణా జిల్లా నుంచిపోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. కృష్ణా జిల్లాలోని 16నియోజకవర్గాల్లోను ఎక్కడ నుంచి పోటీ చేసినా లోకేష్ లక్ష ఓట్ల మెజార్టీలో గెలుస్తారని, ఆయనకు మంత్రిపదవి ఇవ్వడం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పారు.