
ఉపాధి కల్పనే ధ్యేయం
► మంత్రి గంటా శ్రీనివాసరావు
► ఏయూలో సందడిగా జాబ్‌మేళా
► నేడూ కొనసాగింపు
ఏయూ క్యాంపస్/బీచ్‌రోడ్ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏయూ స్నాతకోత్సవ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ‘డిజిటల్ సమ్మిట్ జాబ్ మేళా 2016’ను ఆయన ప్రారంభించారు. ఉన్నత విద్యా మండలి, ఏయూ, మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్్స, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ సంయుక్తం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ వర్సిటీలో కాలానుగుణంగా జాబ్‌మేళాలు నిర్వహించాలన్నారు. ఏయూ వీసీ జి. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యాభ్యాసం పూర్తి చేసి కళాశాల నుంచి వెళ్లే సమయానికి విద్యార్థికి ఉపాధి అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జాబ్ మేళాలో 20 వేల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ సీఈవో ప్రసాద్, మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూష¯Œ్స సీఈవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేళా విజయవంతంపై హర్షం : జాబ్‌మేళాలో తొలిరోజు 1,250 మంది అభ్యర్థులు ఎంపిక కావడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. రెండోరోజు సైతం ఇదే స్ఫూర్తితో మరింత మందికి ఉపాధిని కల్పించాలని సూచించారు. ఏయూ, మిలీనియం, మిరాకిల్ సంస్థలు చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు.
1250 మంది ఎంపిక : తొలిరోజు జరిగిన ప్రక్రియ లో 1, 250 మంది ఎంపికయ్యారు. వీరిలో మిరాకిల్ సంస్థలకు 282, యలమంచిలి సాఫ్ట్‌వేర్‌కు 50, ఐఐసీ టెక్‌కు 25, ఓపెన్ లాజిక్‌కు 125, ఏమ్‌జూర్‌కు 50, బల్క్‌హవర్‌కు 45, నోవల్ పేటెంట్‌కు 100, రోబో కంప్యూటెక్‌కు 100, మేట్రిక్స్ 50, జైన్ ఇన్ఫోటెక్‌కు 20 మంది, మిగతా సంస్థలకు మరికొంత మంది ఎంపికైనట్టు మిలీనియం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ సీఈవో జి.శ్రీధర్ రెడ్డి తెలిపారు. హెచ్‌ఎస్‌బీసీ సంస్థ 700 మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలో ఎంపిక చేసిందని, వీరికి శనివారం మరికొన్ని నైపుణ్యాల్లో పరీక్షించి, ప్రతిభావంతులను ఎంపిక చేస్తుందన్నారు.
హైదరాబాద్ నుంచి వచ్చా
జాబ్‌మేళా కోసం ఎంతో ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి వచ్చా. అనుకున్నంత ఎక్కువ కంపెనీలు ఈ జాబ్‌మేళాల్లో పాల్గొనలేదు. ప్రతీ కంపెనీ వారు ఫోన్ చేసి చెబుతా మంటున్నారు. – ఎల్.హరీశ్, బీఎస్సీ, హైదరబాద్
మా కోర్సుకు ఉద్యోగాలు లేవట
నేను బీఈ మెకానికల్ చేశాను. ఈ కోర్సుకు ఈ జాబ్‌మేళాలో పాల్గొన్న కంపెనీల్లో ఉద్యోగాలు లేవని చెబుతున్నారు. ప్రకటనలో అన్ని డిగ్రీ కోర్సుల వారికి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. తీరా వస్తే ఇక్కడ పరిస్థితి వేరు. జాబ్‌మేళా వల్ల సమయం వృథా అయింది.
– పద్మజ, బీఈ, మెకానికల్
ఖాళీలను ముందే తెలపాలి
ఏ ఏ కంపెనీల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ముందే తెలపాలి. జాబ్‌మేళా అంటే మౌకిక పరీక్షలు నిర్వహించి ఉద్యోగం వచ్చిందో లేదో వెంటనే చెప్పాలి. నేను నాలుగు కంపెనీ ఉద్యోగాల కోసం వెళ్తే.. అందరూ నా దరఖాస్తులు తీసుకొని ఫోన్ చేస్తామన్నారు. ఈ జాబ్‌మేళాలో రూ. 8 వేల నుంచి రూ.15 వేల మధ్య వచ్చే ఉద్యోగాలే ఉన్నాయి. ఈ జీతంతో నెలమొత్తం ఎలా నెట్టుకురాగలం.
– సంపత్, బీటెక్
ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు
జాబ్‌మేళా వల్ల ప్రముఖ కంపెనీలన్నింటికీ ఒకే చోట దరఖాస్తు చేసుకోవచ్చు. నేను రెండు ఉద్యోగాల కోసం మౌకిక పరీక్షలకు హాజరయ్యాను. వారు ఫోన్ చేసి చెబుతామన్నారు. నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉంది. – మనీషా, బీఎస్సీ
నిరాశలో నిరుద్యోగులు
ఏయూలో జరిగిన జాబ్‌మేళాలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ప్రకటనలో తెలిపిన విధంగా మాత్రం ఇక్కడ పరిస్థితి లేకపోవడంతో ఆందోâýæన చెందారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని, ఫోన్ చేస్తామని చాలా సంస్థలు చెప్పడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కంపెనీలు సేల్స్‌మెన్ ఉద్యోగాలకు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.