- ఎస్సై నిరంజన్ రావుకు సాహస అవార్డుకు రిఫర్ చేస్తాం
- మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
- ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు l
స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులకు జోహార్లు
Published Fri, Sep 16 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
రాజమహేంద్రవరం క్రైం:
ప్రాణాలకు తెగించి ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్లును పట్టుకున్నారని, ఈ సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందగా, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రావు తీవ్రగాయాల పాలయ్యారని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కె. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గంజాయి నిందితులను పట్టుకునే సంఘటనలో గురువారం గాయాల పాలై మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలను పరామర్శించడానికి జిల్లాకు విచ్చేసిన ఆయన రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి స్మగ్లింగ్ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 10 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర ఎనిమిది రాష్ట్రాల నుంచి వివిధ వాహనాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకర్లు, లారీలు, కార్లలో గంజాయిని తరలిస్తున్నారని ఆయన తెలిపారు. వారిని పట్టుకోడానికి వెళ్ళే ఎక్సైజ్ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. 2016 లో 70 కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ మురళీ కృష్ణ ఆగస్టు 19 వ తేదీన 700 కేజీల గంజాయిని పట్టుకునేందుకు సహకరించాడని తెలిపారు. ప్రత్తిపాడు మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి స్మగ్లర్ పోలీసులను గాయపరిచి తప్పించుకునే క్రమంలో కారును స్టీరింగ్ తిప్పి తిరగబెట్టాడని అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సౌకర్యలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్సై నిరంజన్ రావుకు సాహస అవార్డు ఇచ్చేందుకు కృషి చేస్తామని, అలాగే విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నక్సల్స్ డ్యూటీ నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్స్ ప్రమాదంలో మృతి చెందితే రూ. 5 లక్షలు ఇస్తారని, ఎక్సైజ్ శాఖలో రూ. 50 వేలు మాత్రమే ఇస్తారని ఆయన అన్నారు. ఎక్సైజ్ శాఖ సిబ్బంది విధులు కూడా ప్రమాదభరితమైనదేనని వారికి కూడా పోలీస్ శాఖకు ఇచ్చే సౌకర్యలు కల్పించేందు చర్యలు చేపడతామని అన్నారు. గిరిజనులకు అవగాహన కల్పించి గంజాయి నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యనారాయణ, కాకినాడ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, రాజమహేంద్రవరం ఎక్సైజ్ సూపరింటెంటెండ్ ఎన్. సుర్జిత్ సింగ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్. లక్ష్మీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement