కడప కల్చరల్ : నయా జోష్ కాస్త తగ్గినట్లే కనిపించింది. పెద్దనోట్ల రద్దుతో మిగతా వ్యాపారాలపై కనిపించిన ప్రభావమే నూతన సంవత్సర వేడుకలపై కూడా పడింది. అయినా ప్రజలు మిగతా అన్ని అవసరాలను పక్కకు నెట్టి దాదాపు రూ. 8 కోట్ల ఖర్చుతో నూతన సంవత్సర వేడుకలకు ఘనంగా స్వాగతం పలికారు. విందులు, వినోదాలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. ఈ ఒక్కరోజు ఆనందంగా గడిపితే ఈ సంవత్సరమంతా అలాగే గడిస్తుందన్న సెంటిమెంటుతో వీలైనంత వరకు ఆనందంగా గడిపేందుకే ప్రాధాన్యతనిచ్చారు. నూతన సంవత్సర వేడుకల కోసం డిసెంబరు 31, జనవరి 1 తేదీలలో దాదాపు రూ. 8 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. గత సంవత్సరంలో రూ. 11 కోట్లకు పైగా వ్యాపారాలు జరగ్గా, ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది. విందులు, వినోదాలలో యువత పాత్రే ఎక్కువగా ఉంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు విందులు, వినోదాలు జరిగాయి. ముఖ్యంగా మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. ఈ సంవత్సరం రూ. 3.50 కోట్ల మద్యం వ్యాపారం జరిగిందని సమాచారం.
ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ప్యాకేజీలతో పార్టీలు ఏర్పాటు చేయడంతో సీటు కోసం వేచి ఉండాల్సిన స్థితి ఏర్పడింది. మాంసాహార పదార్థాల ధరలు 10 నుంచి 30 శాతం పెరిగినా డిమాండ్ బాగానే ఉండింది. విందులు, వినోదాల కోసమే రూ. 2 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు తెలిసింది. కొన్ని ప్రముఖ రెస్టారెంట్లు ప్యాకేజీ ఫుడ్ కోసం వచ్చిన వారితో కిటకిటలాడాయి. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ధరలు దాదాపు రెట్టింపు అయినా కేకులకు కూడా డిమాండ్ ఏర్పడింది. 99 శాతం కేకులు ఆదివారం మధ్యాహ్యానికి ఖర్చయ్యాయి. ఇక పూల బొకేలు, పండ్ల వ్యాపారాలు కూడా జోరుగానే సాగాయి. మొత్తంపై శని, ఆది వారాల్లో జిల్లాలో నూతన సంవత్సర వేడుకల కోసం దాదాపు రూ. 8 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
తగ్గిన నయా జోష్..!
Published Sun, Jan 1 2017 11:05 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement