రిమ్స్‌లో జూడా(జూనియర్ డాక్టర్)లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం విధులు బహిష్కరించిన జూడాలు ఓపి విభాగం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూడా అసోసియేషన్ చీఫ్ అడ్వయిజర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ విధులు నిర్వర్తించే వైద్యులకు రోజు రోజుకు రక్షణ లేకుండా పోతోందన్నారు.
సెక్యూరిటీ సిబ్బంది కొరతతో వైద్యులకు భద్రత లేదని, రోగి బంధువులు పెద్దయెత్తున వచ్చి వైద్యుల విధులకు ఇబ్బందులు కలుగచేస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది మద్యం తాగి వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓపీ, ఎమర్జెన్సీ వార్డులో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులను నియమించాలని అన్నారు. జూడాలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జూడాలు ప్రవీణ్, దీక్షిత్, స్వేచ్చా, తదితరులు పాల్గొన్నారు.