జూరాల నీళ్లు.. జిల్లా ప్రజల జన్మహక్కు
Published Fri, Jul 29 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
– బహిరంగ సభలో రాష్ట్ర నేతలు
కొడంగల్ : జూరాల ప్రాజెక్టు నీళ్లు పాలమూరు జిల్లా ప్రజల హక్కని అఖిలపక్ష నాయకులు అన్నారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధించుకోడానికి చేపట్టిన మహాపాదయాత్ర శుక్రవారం ఉదయం కొడంగల్‌కు చేరింది. ఈ సందర్భంగా బస్టాండు ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీజేపీ ఉపాధ్యక్షుడు నాగూరాం నామాజీ, జలసాధన కమిటీ జిల్లా కన్వీనర్ అనంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కృష్ణ, టీడీపీ నాయకులు బాలప్ప, సత్యనారాయణరెడ్డి మాట్లాడారు. జిల్లా పరిధిలో ప్రవహిస్తున్న కృష్ణా నది నుంచి ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకోడానికి అనుమతులు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేయడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 69జీఓను ఆపడం ఎవరి తరమూ కాదని, ఉద్యమాలతోనే సాగునీరు సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకూ వ్యతిరేకత వస్తోందన్నారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తాము ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని, నిర్వాసితులకు పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. నారాయణపేట డివిజన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు శరణమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నర్సిములు, జలసాధన కమిటీ కన్వీనర్ దామోదర్‌రెడ్డి, అఖిలపక్ష నాయకులు మహ్మద్ యూసూఫ్, ప్రశాంత్, ఇందనూర్ బషీర్, కరెంటు రాములు, కృష్ణంరాజు, సుభాష్ నాయక్, చంద్రప్ప, లక్ష్మణ్, బస్వరాజ్, గందె ఓంప్రకాశ్, కేశవులు, కిల్లె గోపాల్, జబ్బార్, బాలప్ప పాల్గొన్నారు.
Advertisement