jurala water
-
జూరాలకు భారీ వరద
గద్వాల టౌన్: ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. మంగళవారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 25 క్రస్టు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,28,146 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి, ఇతర కాల్వల ద్వారా దిగువ నదిలోకి 2,54,910 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,45,424 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువ నదిలోకి 1,56,407 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 10 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలో కి 2,57,844 క్యూసెక్కుల వరదను విడుదల చే స్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న జూరాలకు బుధవారం ఉదయానికి వరద స్థాయి మరింతగా పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర నదిలోనూ.. కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర నదిపై కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం100.83 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,44,757 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టులోని 33 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలోకి 1.54 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీ వద్ద 1,16,536 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజీకి వరద మరింతగా పెరగనుంది. ఎత్తిపోతల పథకాలకు.. జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి ఎత్తిపోతల పథకాలకు పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, భీమా స్టేజీ–1కు 650, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల కుడి ప్రధాన కాల్వకు 822, ఎడమ ప్రధాన కాల్వకు వెయ్యి, సమాంతర కాల్వకు 340 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 21,995 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. -
జూరాల నీళ్లు.. జిల్లా ప్రజల జన్మహక్కు
– బహిరంగ సభలో రాష్ట్ర నేతలు కొడంగల్ : జూరాల ప్రాజెక్టు నీళ్లు పాలమూరు జిల్లా ప్రజల హక్కని అఖిలపక్ష నాయకులు అన్నారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధించుకోడానికి చేపట్టిన మహాపాదయాత్ర శుక్రవారం ఉదయం కొడంగల్‌కు చేరింది. ఈ సందర్భంగా బస్టాండు ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీజేపీ ఉపాధ్యక్షుడు నాగూరాం నామాజీ, జలసాధన కమిటీ జిల్లా కన్వీనర్ అనంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కృష్ణ, టీడీపీ నాయకులు బాలప్ప, సత్యనారాయణరెడ్డి మాట్లాడారు. జిల్లా పరిధిలో ప్రవహిస్తున్న కృష్ణా నది నుంచి ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకోడానికి అనుమతులు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేయడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 69జీఓను ఆపడం ఎవరి తరమూ కాదని, ఉద్యమాలతోనే సాగునీరు సాధ్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రోజురోజుకూ వ్యతిరేకత వస్తోందన్నారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తాము ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని, నిర్వాసితులకు పార్లమెంట్లో ఆమోదించిన చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. నారాయణపేట డివిజన్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు శరణమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నర్సిములు, జలసాధన కమిటీ కన్వీనర్ దామోదర్‌రెడ్డి, అఖిలపక్ష నాయకులు మహ్మద్ యూసూఫ్, ప్రశాంత్, ఇందనూర్ బషీర్, కరెంటు రాములు, కృష్ణంరాజు, సుభాష్ నాయక్, చంద్రప్ప, లక్ష్మణ్, బస్వరాజ్, గందె ఓంప్రకాశ్, కేశవులు, కిల్లె గోపాల్, జబ్బార్, బాలప్ప పాల్గొన్నారు. -
తాగడానికైనా నీళ్లు వదలండి
అలంపూర్/ మానవపాడు : ‘వర్షాభావ పరిస్థితులతో పంటలే కాదు... తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కనీసం ఆర్డీఎస్ కాల్వల ద్వారారైనా జూరాల నీళ్లు వదిలి ఆదుకోవాలి..’ అంటూ రెండు మండలాల రైతులు బూడ్దిపాడు క్యాంపులోని ఆర్డీఎస్ కార్యాలయం ఎదుట ఆదివారం ఉదయం 11 గంటలకు ఆందోళనకు దిగారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ఈఈ రమేష్, ఏఈలు వరప్రసాద్, రాజు; సిబ్బందితోపాటు నాయకులు వరన్నగౌడ్, బోరవెల్లి సత్యారెడ్డి, ప్రకాశంగౌడ్ను కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలంపూర్, మానవపాడు మండలాల్లో కరువుఛాయలు అలుముకుని చెరువులు, కుంటల్లో నీరు లేక భూరగ్భ జలాలు అడుగంటాయన్నారు. దీంతో ఉండవెల్లి, కంచుపాడు, చిన్న అముదాలపాడు, కోనేరు, బుక్కాపురం, ఉట్కూరు, లింగవనాయి ప్రజలు, మూగజీవాలకు తాగునీటి సమస్య జఠిలంగా మారిందన్నారు. జూరాల కింద పంట సాగు అలస్యమవుతుంది కాబట్టి అంతవరకు జూరాల లింకు ద్వారా కిందికి నీళ్లు వదలాలన్నారు. జూరాల నీటిని కిందికి వదలాలనే హక్కు లేదని అధికారులు చెబుతున్నా మానవతాదృక్పథంతో నీటిని వదిలేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండటంతో తాగునీటి బోర్లు పనిచేయడం లేదని, బోరుబావుల కింద, ఎత్తిపోతల పథకాల కింద వేసిన పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ట్యాంకుపైకి ఎక్కి నిరసన అనంతరం ఇద్దరు రైతులు ఆర్డీఎస్ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఉన్న నీటి ట్యాంకు ఎక్కి కొద్దిసేపు నిరసన తెలిపారు. కనీసం తాగునీటికైనా నీళ్లు వదలడానికి అధికారులు చొరవ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారంకాకపోతే జాతీయ రహదారిని లేదా జూరాల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అక్కడ ఉన్న తోటి రైతులు వారించడంతో కిందికి దిగివచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో ఆర్డీఎస్ కార్యాలయానికి చేరడంతో ఎస్ఐ విజయకుమార్ పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అలాగే ట్రాన్స్ ఎస్ఈ సదాశివరెడ్డికి ఫోన్లో విషయం చెప్పి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. చివరకు మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేసి వెనుదిరిగారు.