అలంపూర్/ మానవపాడు : ‘వర్షాభావ పరిస్థితులతో పంటలే కాదు... తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కనీసం ఆర్డీఎస్ కాల్వల ద్వారారైనా జూరాల నీళ్లు వదిలి ఆదుకోవాలి..’ అంటూ రెండు మండలాల రైతులు బూడ్దిపాడు క్యాంపులోని ఆర్డీఎస్ కార్యాలయం ఎదుట ఆదివారం ఉదయం 11 గంటలకు ఆందోళనకు దిగారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ఈఈ రమేష్, ఏఈలు వరప్రసాద్, రాజు; సిబ్బందితోపాటు నాయకులు వరన్నగౌడ్, బోరవెల్లి సత్యారెడ్డి, ప్రకాశంగౌడ్‌ను కార్యాలయంలో నిర్బంధించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలంపూర్, మానవపాడు మండలాల్లో కరువుఛాయలు అలుముకుని చెరువులు, కుంటల్లో నీరు లేక భూరగ్భ జలాలు అడుగంటాయన్నారు. దీంతో ఉండవెల్లి, కంచుపాడు, చిన్న అముదాలపాడు, కోనేరు, బుక్కాపురం, ఉట్కూరు, లింగవనాయి ప్రజలు, మూగజీవాలకు తాగునీటి సమస్య జఠిలంగా మారిందన్నారు. జూరాల కింద పంట సాగు అలస్యమవుతుంది కాబట్టి అంతవరకు జూరాల లింకు ద్వారా కిందికి నీళ్లు వదలాలన్నారు.
జూరాల నీటిని కిందికి వదలాలనే హక్కు లేదని అధికారులు చెబుతున్నా మానవతాదృక్పథంతో నీటిని వదిలేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండటంతో తాగునీటి బోర్లు పనిచేయడం లేదని, బోరుబావుల కింద, ఎత్తిపోతల పథకాల కింద వేసిన పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు.
ట్యాంకుపైకి ఎక్కి నిరసన
అనంతరం ఇద్దరు రైతులు ఆర్డీఎస్ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఉన్న నీటి ట్యాంకు ఎక్కి కొద్దిసేపు నిరసన తెలిపారు. కనీసం తాగునీటికైనా నీళ్లు వదలడానికి అధికారులు చొరవ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారంకాకపోతే జాతీయ రహదారిని లేదా జూరాల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అక్కడ ఉన్న తోటి రైతులు వారించడంతో కిందికి దిగివచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో ఆర్డీఎస్ కార్యాలయానికి చేరడంతో ఎస్‌ఐ విజయకుమార్ పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంపత్‌కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అలాగే ట్రాన్స్ ఎస్‌ఈ సదాశివరెడ్డికి ఫోన్లో విషయం చెప్పి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు. చివరకు మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేసి వెనుదిరిగారు.
తాగడానికైనా నీళ్లు వదలండి
Published Mon, Aug 18 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement