జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదలవుతున్న వరద
గద్వాల టౌన్: ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. మంగళవారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 25 క్రస్టు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,28,146 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి, ఇతర కాల్వల ద్వారా దిగువ నదిలోకి 2,54,910 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,45,424 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువ నదిలోకి 1,56,407 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 10 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలో కి 2,57,844 క్యూసెక్కుల వరదను విడుదల చే స్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న జూరాలకు బుధవారం ఉదయానికి వరద స్థాయి మరింతగా పెరిగే అవకాశం ఉంది.
తుంగభద్ర నదిలోనూ..
కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర నదిపై కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం100.83 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,44,757 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టులోని 33 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలోకి 1.54 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీ వద్ద 1,16,536 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజీకి వరద మరింతగా పెరగనుంది.
ఎత్తిపోతల పథకాలకు..
జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి ఎత్తిపోతల పథకాలకు పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, భీమా స్టేజీ–1కు 650, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల కుడి ప్రధాన కాల్వకు 822, ఎడమ ప్రధాన కాల్వకు వెయ్యి, సమాంతర కాల్వకు 340 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 21,995 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment