అణు కుంపటి వద్దు
అణు కుంపటి వద్దు
Published Mon, Aug 8 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
నెల్లూరు(అర్బన్): ప్రపంచదేశాలు వదిలించుకోవాలని చూస్తున్న అణుకుంపటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొవ్వాడలో ఒకటి, నెల్లూరు –ఒంగోలు సరిహద్దులో మరొకటి ఏర్పాటు చేయాలంటూ కేంద్రాన్ని బొట్టుపెట్టి మరీ పిలవడం దారుణమని జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షుడు పి.బుజ్జయ్య పేర్కొన్నారు. కావలి సమీపంలో ఏర్పాటయ్యే అణుకుంపటిని అడ్డుకోవాలంటూ ఆదివారం ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, వీఆర్సీ, చిల్డ్రన్స్ పార్కు తదితర ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బుజ్జయ్య మాట్లాడారు. హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుతో క్షణంలో 3.40 లక్షలమంది మరణించారని గుర్తు చేశారు. అలాంటి అణుకుంపటిని రాకుండా అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ ఆరోగ్య సబ్‌కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్, నగర అధ్యక్షుడు పోతంశెట్టి విద్యాచరణ్, డీవైఎఫ్‌ఐ నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు.
పోర్టు నిర్మించండి
కావలిఅర్బన్: ప్రజల ప్రాణాలను బలిగొనే అణువిద్యుత్ కేంద్రం కాకుండా ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అభివృద్ధి చెందే పోర్టును నిర్మించాలని దళిత మోర్చా నాయకులు, రాష్ట్ర మహిళా మోర్చ నాయకురాలు వరలక్ష్మిలు తెలిపారు. స్థానిక బాలకృష్ణారెడ్డినగర్‌లో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నాయపాళెం సమీపంలో తలపెట్టిన అణువిద్యుత్ నిర్మాణ కేంద్రాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. బీజేపీ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ రామాయపట్నం పోర్టు కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో మాట్లాడుతూ కృషి చేస్తున్నారని తెలిపారు. పోర్టును నిర్మిస్తే రెండు జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో గోసాల చార్లెస్, గుర్రం చిట్టిబాబు, ఎస్‌కే సిరాజ్, ఎస్‌కే జమీల, ఎస్‌కే సలార్ పాల్గొన్నారు.
Advertisement