జ్యోతుల ఫ్యామిలీ జులుం
టోల్‌రుసుం కోసం అల్లుడి కారు ఆపినందుకు సిబ్బందిపై దాడి
నిజాయతీగా టోల్ ఫీజు అడిగితే ఏకంగా జులుం ప్రదర్శించారు. మంగళవారం రాత్రి దాడులకు దిగారు. ఎమ్మెల్యే స్థాయిలో, అదీ సీనియారిటీ వెలగబెడుతున్న జ్యోతుల నెహ్రూ అయినా కొడుకును మందలించి ఉంటే హుందాగా ఉండేది. మహరాజా అని అభ్యర్థించుకుంటే మరి రెండు తన్నమన్నట్టుగా ప్లాజా సిబ్బందిపై బుధవారం మరింత రెచ్చిపోయి దాడులకు దిగడమే కాకుండా ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయించారు. రక్షక భటులు కూడా పెద్దలకే కొమ్ముకాస్తూ చిన్నలపై చిర్రుబుర్రులాడారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజా ప్రతినిధులైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ బాధ్యత విస్మరించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద నెహ్రూ అల్లుడి కారును ఆపారని టోల్‌గేట్ సిబ్బందిపై అనుచరులతో దాడి చేయించారు. అంతటితో ఆగకుండా క్షమాపణ చెప్పేందుకు ఇంటికి వచ్చిన సిబ్బందిపై మరోసారి దాడి చేయించారు. టోల్‌గేట్ యాజమాన్యంతో ఇద్దరు సిబ్బందిపై వేటు వేయించారు. అధికార బలంతో చిరు ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డ జ్యోతుల కుటుంబంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత రాత్రి బావమరిది సమక్షంలో దాడి
జ్యోతుల నెహ్రూ అల్లుడు తోట బబ్బీ వాహనాన్ని మంగళవారం రాత్రి కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద టోల్ రుసుంకోసం ఆపారు. తన కారునే ఆపుతారా? అంటూ ఆయన టోల్ ప్లాజా సిబ్బందిపై చిందులు తొక్కారు. క్షణాల్లో బావమరిది, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్‌ను రప్పించారు. కారును ఆపిన సిబ్బందిని అప్పగించాలంటూ నవీన్ ఉసిగొల్పడంతో అనుచరులు దౌర్జన్యకాండకు దిగారు.