వైభవంగా జ్యోతుల ఉత్సవం
- పోటాపోటీగా ఎద్దుల బండ్ల ప్రదర్శన
రొద్దం : మండల కేంద్రంలోని పెన్నానది ఒడ్డున వెలసిన పురాతన రుద్రపాద రొద్దకాంబదేవి 10వ జాతరోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం జ్యోతుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో ఇంటికో జ్యోతిని తీసుకెళ్లి అంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. మొత్తం జ్యోతులన్నీ వచ్చాక ప్రదర్శనగా బయల్దేరి అమ్మవారి ఆలయానికి గుడిచుట్టూ మూడుసార్లు ప్రదక్షణలు చేశారు. అనంతరం జ్యోతులను గ్రామ దేవతకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
జ్యోతులు మోస్తే కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉండటంతో యువతులు పెద్దఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. జ్యోతుల అనంతరం పెద్ద ఎత్తున ఆలయం చుట్టూ ఎద్దుల బండ్ల ప్రదక్షణలను రైతులు పోటాపోటీగా చేశారు. జాతరలో అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా ఎస్‌ఐ మున్నీర్‌అహ్మద్ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశ్వర్థనారాయణ, జెడ్పీటీసీ చిన్నప్పయ్య, ఆస్పత్రి కమిటీ చైర్మన్ ఎంఎస్ నాగరాజు, ఆలయ, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.