వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
ప్రజా వ్యతిరేక విధానాలపై 8నుంచి ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’
రావులపాలెం: రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఆయన మీడియాను నియంత్రిస్తారు, న్యాయ వ్యవస్థను లెక్కచేయరని ఆరోపించారు. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టాక శనివారం తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన కన్నబాబుకు రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన కొత్తపేట నియోజకవర్గ నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నబాబు కు నాయకులను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరి చయం చేశారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ తునిలో మత్స్యకారులపై ఒక సామాజిక వర్గం దాడులు చేసి 72 మందిని గాయపరిచినప్పటికీ, దానిలో మంత్రి సోదరుడి పాత్ర ఉన్నట్టు బాధితులు చెబుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేరన్నారు. ముద్రగడ దీక్ష చేసినా, రైతులుధర్నాలు చేసినా, ఏసమస్య వచ్చినా వెనుక జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు.
ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలతో ఎవరు ఇబ్బందులు పడినా వారికి అండగా ఉంటానని జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొనివారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చేందుకు ఈనెల 8వ తేదీ నుంచి గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
అనంతరం ఆయన కొత్తపేట నియోజకవర్గంలో తలెత్తిన ప్రొటోకాల్ వివాదంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా బాధ్యతలు, హక్కులు ఒకే విధంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్సీలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే అన్ని చోట్లా అదే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. శిలాఫలకాలపై టీడీపీ కార్యకర్త అనే పదవి రాసుకునే స్థాయికి వ్యవస్థను ప్రభుత్వం దిగజార్చిందన్నారు. ఎమ్మెల్యేకే సభాధ్యక్షునిగా మొదటి ప్రాధాన్యత ఉంటుందనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, వాటిని మార్చాలనుకుంటే జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తలే పార్టీకి బలం: ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
ప్రలోభాలకు లొంగి కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీని వెన్నంటి ఉన్నారని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా చూస్తు ఊరుకోబోమని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్ రాజు, ప్రచార కార్యదర్శి మునుసూరి వెంకటేశ్వరరావు, సేవాదళ్ జాయింట్ సెక్రటరీ చల్లా ప్రభాకరరావు, జిల్లా సేవాదళ్ విభాగం కన్వీనర్ మార్గన గంగాధరరావు, ఇండస్ట్రియల్ విభాగం కన్వీనర్ మంతెన రవిరాజు పాల్గొన్నారు.