'హైదరాబాద్లో ఆంధ్ర ఓటర్లు కావాలి గానీ ...'
విజయవాడ : దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలో నారాయణ మాట్లాడుతూ... కేంద్రం చేతుల్లో రాష్ట్ర గవర్నర్లు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరుణాచల్ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఇదే విషయం మరోసారి స్పష్టమైందని తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ విద్యార్థి రోహిత్ కులంపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం దారుణమని నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఆంధ్రా ఓటర్లు కావాలి గానీ... ఆంధ్ర విద్యార్థి చినిపోతే మాత్రం పట్టించుకోరా... అంటూ చంద్రబాబుపై నారాయణ నిప్పులు చెరిగారు.
మంత్రి రావెల కిషోర్ బాబును పంపి రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజధాని రైతులను చంద్రబాబు బ్లాక్మెయిల్ ధోరణిలో బెదిరిస్తున్నారని విమర్శించారు. రైతులను ఒప్పించి... రాజధాని నిర్మించుకోవాలని చంద్రబాబుకు సీపీఐ నారాయణ సూచించారు.