కాసుల కక్కుర్తి.. కమీషన్ల దాహార్తి
కాసుల కక్కుర్తి.. కమీషన్ల దాహార్తి
Published Tue, May 23 2017 12:12 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం పనిచేసే మహిళా శిశు సంక్షేమ శాఖలో చిరుద్యోగులను జలగల్లా పీక్కుతింటున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల నుంచి కమీషన్ల రూపంలో వసూళ్లకు తెగబడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 అంగన్‌వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,888 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 3,888 కార్యకర్తలు, మరో 3,888 మంది సహాయకులు పని చేస్తున్నారు. కార్యకర్తలకు రూ.7 వేలు, సహాయకులకు రూ.3,500 చొప్పున ప్రభుత్వం వేతనంగా చెల్లిస్తోంది. ఈ మొత్తాలు సకాలంలో విడుదల కాకపోవడం కార్యకర్తలకు, సహాయకులకు శాపంగా మారుతోంది.
బడ్జెట్ విడుదలైనప్పుడల్లా..
అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు నాలుగైదు నెలలకు ఒకసారి జీతాల బడ్జెట్ విడుదల అవుతోంది. ఆ సొమ్మును వారికి చెల్లించే సందర్భంలో కార్యకర్తల నుంచి నెలకు రూ.1,000, ఆయాల నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారని అంగన్‌వాడీలు వాపోతున్నారు. ఇదేమని అడిగితే.. తామే జీతాల బడ్జెట్ విడుదల చేయిం చామని, లేదంటే జీతాలు వచ్చేవి కాదంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. టీఏ బిల్లులు చెల్లించేందుకు 5 శాతం నుంచి 10 శాతం సొమ్మును కార్యకర్తల ప్రాజెక్ట్ అధికారులు వసూలు చేస్తున్నారు.
సూపర్‌వైజర్ల పనులు కార్యకర్తలే చేయాలి
ఐసీడీఎస్ ప్రాజెక్టులను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్ల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించేందుకు ప్రభుత్వం సూపర్‌వైజర్లను నియమించింది. ఈ పనులను ఆన్‌లైన్‌లో కార్యకర్తలే చేయాల్సి వస్తోంది. ఇందుకయ్యే ఖర్చుల నిమిత్తం వారే చేతి చమురు వదిలించుకోవాలి్సన పరిస్థితి ఉంది. ఈ పనులు కూడా ప్రాజెక్టు ఉన్నతాధికారులు నిర్దేశించిన నెట్ సెంటర్ల వద్ద మాత్రమే కార్యకర్తలు నిర్వహించాలి. తద్వారా నెట్‌సెంటర్ల నుంచి కమీషన్ల వసూలుకు ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు.
సొమ్ములిస్తేనే సెలవులు
అంగన్‌వాడీ కార్యకర్తకు జ్వరం వచ్చినా, ముఖ్యమైన పనులున్నా.. వారి కుటుంబంలో ఎవరైనా మరణిం చినా ఐదు రోజులకు పైబడి సెలవు ఇవ్వాల్సి వస్తే ఉన్నతాధికారులకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు సమర్పించుకోవాల్సి వస్తోంది. లేదంటే గైర్హాజరు పేరుతో ఆ కార్యకర్తకు వేధింపులు తప్పడం లేదు.
బినామీ కార్ల బాగోతం
సీడీపీఓలు బినామీల పేర్ల్లతో కార్లు నడుపుతున్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ విధానాన్ని రద్దు చేస్తూ నూతనంగా టెండర్ల ప్రక్రియను ప్రారంభించేం దుకు సిద్ధమయ్యారు. ఇది ప్రాజెక్ట్ అధికారులకు మింగుడు పడటం లేదు. వారంతా సిండికేట్‌గా ఏర్పడి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడటం హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement